Lakshadweep: లక్షద్వీప్‌ టూరిజానికి బిగ్ బూస్ట్.. కీలక ప్రకటన చేసిన టాటా గ్రూప్

  • 2026లో రెండు తాజ్ బ్రాండెడ్ రిసార్ట్‌లను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటన
  • 'బాయ్‌కాట్ మాల్దీవులు' ప్రచారం నేపథ్యంలో టాటా గ్రూపు అనుబంధ ఐహెచ్‌సీఎల్ వెల్లడి
  • సుహేలీ, కద్మత్ దీవులలో తాజ్ బ్రాండెడ్ రిసార్టులను ఏర్పాటు చేస్తామని ప్రకటన
Big boost for Lakshadweep tourism as Tata Group made announcement of 2 Resorts

భారత్ - మాల్దీవుల వివాదం నేపథ్యంలో లక్షద్వీప్‌ పర్యాటకానికి ఊతమిస్తూ దేశీయ పారిశ్రామిక వ్యాపార దిగ్గజం టాటా గ్రూప్ కీలక ప్రకటన చేసింది. లక్షద్వీప్‌లోని సుహేలీ, కద్మత్ దీవులలో తాజ్ బ్రాండెడ్ రిసార్టులను ఏర్పాటు చేయనున్నట్టు టాటా గ్రూప్ ఆతిథ్యరంగ అనుబంధ సంస్థ ఇండియన్ హోటల్స్ కంపెనీ (ఐహెచ్‌సీఎల్) ప్రకటించింది. ఈ రెండు రిసార్టులను 2026లో ప్రారంభించనున్నట్టు తెలిపింది. ఈ మేరకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్టు వెల్లడించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల లక్షద్వీప్‌ను సందర్శించిన నేపథ్యంలో ఇండియా- మాల్దీవుల వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. బాయ్‌కాట్ మాల్దీవులు ప్రచారం నేపథ్యంలో టాటా గ్రూప్ ప్రకటన లక్షద్వీప్‌ పర్యాటకానికి మరింత దోహదం చేయనుంది. 

ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకున్నట్టు ఐహెచ్‌సీఎల్ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పునీత్ ఛత్వాల్ ఒక ప్రకటన విడుదల చేశారు. అరేబియా సముద్రం మధ్యలో ఉన్న లక్షద్వీప్‌ సహజమైన బీచ్‌లు, పగడపు దిబ్బలు పర్యాటకులను ఆకర్షించగలవని ‘ఎక్స్’ వేదికగా పేర్కొన్నారు. సుహేలిలో నిర్మించనున్న తాజ్‌ రిసార్టులో 60 బీచ్ విల్లాలు, 50 వాటర్ విల్లాలు సహా 110 గదులు ఉండనున్నాయి. ఇక కద్మత్ ద్వీపంలో నిర్మించనున్న తాజ్ రిసార్టులో 75 బీచ్ విల్లాలు, 35 వాటర్ విల్లాలను ఏర్పాటు చేయనున్నారు. మరో లగ్జరీ రిసార్ట్ సంస్థ ‘ప్రవేగ్’ కూడా లక్షద్వీప్‌లో పెట్టుబడులు పెట్టనున్నట్టు ప్రకటించింది.

ఉన్నపళంగా లక్షద్వీప్‌ పర్యాటకానికి ఈ క్రేజ్ ఏంటి?

కేంద్రపాలిత ప్రాంతమైన లక్షద్వీప్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవలే సందర్శించారు. అక్కడి బీచ్‌ అందాలలో సేదదీరిన ఆయన సోషల్ మీడియా వేదికగా ఫొటోలను షేర్ చేశారు. లక్షద్వీప్‌ పర్యాటకాన్ని ప్రోత్సహించేలా జనవరి 5న ఆయన పోస్టులు పెట్టారు. అయితే ఈ పోస్టులపై మాల్దీవుల ముగ్గురు డిప్యూటీ మంత్రులు మర్యం షియునా, మల్షా షరీఫ్, మహ్జూమ్ మాజిద్ వివాదాస్పద రీతిలో స్పందించారు. లక్షద్వీప్ బీచ్‌లు అపరిశుభ్రంగా ఉంటాయని విమర్శించారు. అక్కడితో ఆగకుండా ఇజ్రాయెల్‌ అనుకూల ధోరణిని ప్రదర్శిస్తున్నారంటూ ప్రధాని నరేంద్రమోదీపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలే భారత్ - మాల్దీవుల మధ్య వివాదానికి కారణమయ్యాయి. 

దీంతో 'బాయ్‌కాట్ మాల్దీవులు' ప్రచారం సోషల్ మీడియాలో మొదలైంది. మాల్దీవులకు బదులు లక్షద్వీప్‌ను సందర్శించాలనే ప్రచారం ఒక్కసారిగా ఊపందుకుంది. భారతీయ సెలబ్రిటీలు సైతం తమ గొంతు కలపడంతో ఈ సోషల్ మీడియా వార్‌ మరింత ముదిరింది. లక్షద్వీప్‌ను సందర్శించాలని ఇండియన్ సెలబ్రిటీలు కోరారు. దీంతో అనుచిత వ్యాఖ్యలు చేసిన ముగ్గురు మంత్రులను మాల్దీవుల ప్రభుత్వం తొలగించినప్పటికీ భారతీయులు శాంతించలేదు. మాల్దీవులు వెళ్లే ప్రసక్తేలేదని చెబుతున్నారు. చాలా మంది తమ ట్రిప్‌లను రద్దు చేసుకున్నారు. లక్షద్వీప్‌ ప్రత్యేకతలను తెలుసుకునేందుకు తెగ సెర్చ్ చేస్తున్నారు. దీంతో లక్షద్వీప్‌ పర్యాటకం ఒక్కసారిగా ట్రెండింగ్‌లో నిలిచింది.

More Telugu News