Virat Kohli: టెస్టు ర్యాంకింగ్స్ ప్రకటించిన ఐసీసీ.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఏయే స్థానాల్లో నిలిచారంటే..!

  • దక్షిణాఫ్రికా సిరీస్‌లో రాణించడంతో 6వ స్థానానికి ఎగబాకిన విరాట్ కోహ్లీ
  • టాప్-10లోకి దూసుకొచ్చిన కెప్టెన్ రోహిత్ శర్మ
  • స్థానాలను మెరుగుపరచుకున్న పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్
  • ఇటీవలి సిరీస్‌లో విఫలమవ్వడంతో ర్యాంకులు దిగజార్చుకున్న బాబర్ ఆజమ్, ట్రావిడ్ హెడ్
Virat Kohli and Siraj among big gainers in ICC Test Rankings

ఐసీసీ (ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్) మంగళవారం ఆటగాళ్ల టెస్ట్ ర్యాంకింగ్స్‌ను అప్‌డేట్ చేసింది. కేప్‌టౌన్ టెస్టులో దక్షిణాఫ్రికాపై ఘనవిజయం సాధించడంతో టీమిండియా ఆటగాళ్ల ర్యాంకులు మెరుగయ్యాయి. సెంచూరియన్, కేప్‌టౌన్‌ టెస్ట్ మ్యాచుల్లో సవాలుతో కూడిన పిచ్‌లపై అత్యధిక పరుగులు సాధించిన స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి మూడు స్థానాలు మెరుగుపరచుకొని టాప్-6కు ఎగబాకాడు. టీమిండియాకు చక్కటి ఆరంభాలను అందించిన కెప్టెన్ రోహిత్ శర్మ నాలుగు స్థానాలు ఎగబాకి 10వ ర్యాంకులో నిలిచాడు. 

ఇక ఆస్ట్రేలియా వర్సెస్ పాకిస్థాన్ టెస్ట్ సిరీస్‌లో విఫలమైన బ్యాట్స్‌మెన్ ట్రావిస్ హెడ్, సౌద్ షకీల్ టాప్-10 నుంచి నిష్క్రమించారు. బౌలర్ల విషయానికి వస్తే దక్షిణాఫ్రికాతో జరిగిన రెండవ టెస్టు మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 6/15తో కెరీర్‌ బెస్ట్ నమోదు చేసిన పేసర్ మహ్మద్ సిరాజ్ 13 స్థానాలు ఎగబాకి 17వ ర్యాంక్‌లో నిలిచాడు. ఇక ఇదే సిరీస్‌లో 12 వికెట్లు పడగొట్టిన జస్ప్రీత్ బుమ్రా ఒక స్థానం ఎగబాకి నాలుగో నంబర్‌లో నిలిచాడు.

పాక్ స్టార్ ఆటగాడు బాబర్ ఆజామ్ కూడా రెండు స్థానాలు దిగజారి 8వ ర్యాంక్‌కు పడిపోయాడు. ఇక పాకిస్థాన్ వర్సెస్ ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌లో రాణించిన ఆసీస్ ఆటగాడు లాబూషేన్ రెండు స్థానాలు మెరుగుపరచుకొని 4వ ర్యాంకులో నిలిచాడు. ఇక పాక్ వికెట్ కీపర్, బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ 10 స్థానాలు ఎగబాకి 16వ ర్యాంకును దక్కించుకున్నాడు. వరుసగా మూడు సార్లు 5 వికెట్ల ఫీట్ సాధించిన ఆస్ట్రేలియన్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్ దక్షిణాఫ్రికా ఆటగాడు కగిసో రబాడను వెనక్కి నెట్టి రెండవ స్థానానికి చేరుకున్నాడు. జాష్ హేజిల్‌వుడ్ నాలుగు స్థానాలను మెరుగుపరచుకొని జేమ్స్ ఆండర్సన్‌తో కలిసి ఏడవ స్థానంలో నిలిచాడు.

More Telugu News