Maldives: మాల్దీవులను బాయ్ కాట్ చేసిన భారత టూరిస్టులు... టూరిస్టులను పంపాలంటూ చైనాను అర్థించిన మాల్దీవుల అధ్యక్షుడు

  • లక్షద్వీప్ నేపథ్యంలో భారత్-మాల్దీవుల మధ్య వివాదం
  • తీవ్ర వ్యాఖ్యలు చేసి పదవులు పోగొట్టుకున్న మాల్దీవుల డిప్యూటీ మంత్రులు
  • చైనా పర్యటనలో ఉన్న మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు
  • చైనాను వేనోళ్ల కీర్తిస్తూ ప్రకటనలు
Maldives President urges China to float tourists towards his country

లక్షద్వీప్ అంశంలో భారత ప్రధాని నరేంద్ర మోదీపై మాల్దీవులకు చెందిన ముగ్గురు డిప్యూటీ మంత్రులు నోరు పారేసుకోవడం తెలిసిందే. ఈ వ్యవహారంతో భారతీయుల్లో ఆగ్రహాశాలు పెల్లుబుకుతున్నాయి. ఇప్పటికే ఆ ముగ్గురు డిప్యూటీ మంత్రులను మాల్దీవుల ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అయినప్పటికీ భారతీయుల్లో కోపం చల్లారడంలేదు. 

ఈ క్రమంలో...  ప్రధానంగా టూరిజంపైనే ఆధారపడి మనుగడ సాగిస్తున్న మాల్దీవులను భారత టూరిస్టులు బాయ్ కాట్ చేశారు. ఈ పరిణామంతో మాల్దీవుల ప్రభుత్వం కంగుతింది. మాల్దీవులను సందర్శించే టూరిస్టుల్లో అత్యధికులు భారతీయులే. ఇప్పుడు భారతీయులు రాకపోవడంతో గత కొన్నిరోజులుగా మాల్దీవుల టూరిజం మందగించింది. 

ఈ నేపథ్యంలో, మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు చైనా సాయం కోరుతున్నారు. తమ దేశానికి అధిక సంఖ్యలో టూరిస్టులను పంపాలంటూ ఆయన చైనా ప్రభుత్వాన్ని అర్థించారు. 

మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జుకు చైనా అనుకూల నేత అనే ముద్ర ఉంది. ప్రస్తుతం ఆయన ఐదు రోజుల పర్యటన నిమిత్తం చైనాలో పర్యటిస్తున్నారు. ఆయన పర్యటనకు ఇవాళ రెండో రోజు కాగా, ఫ్యుజియాన్ ప్రావిన్స్ లో నిర్వహించిన మాల్దీవుల బిజినెస్ ఫోరం కార్యక్రమంలో పాల్గొన్నారు. 

చైనా తమకు అత్యంత సన్నిహిత దేశం అని కీర్తించారు. అభివృద్ధిలో తమకు భాగస్వామి అని కొనియాడారు. చైనా అధ్యక్షుడు షి జిన్ పింగ్ 2014లో ప్రారంభించిన బెల్ట్ అండ్ రోడ్ పథకం (బీఆర్ఐ) భేష్ అంటూ ప్రస్తుతించారు. మాల్దీవుల చరిత్రలోనే అత్యంత ప్రాముఖ్యత ఉన్న మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు చైనా చలవేనని అన్నారు. కొవిడ్ సంక్షోభానికి ముందు చైనా తమకు అతి పెద్ద వ్యాపార భాగస్వామిగా ఉందని, ఆ స్థానాన్ని తిరిగి కైవసం చేసుకోవాల్సిందిగా చైనాను కోరుతున్నామని ముయిజ్జు పేర్కొన్నారు.

కాగా, ముయిజ్జు పర్యటన నేపథ్యంలో మాల్దీవుల్లో పర్యాటకాన్ని అభివృద్ధి చేసేందుకు.. ఇరుదేశాల మధ్య 50 మిలియన్ల డాలర్ల ఒప్పందం కుదిరిందని మాల్దీవుల మీడియా తెలిపింది.

More Telugu News