KTR: కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి.. 'సీఎం' కంటే కేసీఆరే పవర్‌ఫుల్: కేటీఆర్

  • ఖమ్మం లోక్ సభ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో కేటీఆర్ వ్యాఖ్య
  • పార్లమెంట్ నియోజకవర్గాల సమీక్ష తర్వాత అసెంబ్లీల వారీగా సమీక్షలు ఉంటాయని వెల్లడి
  • ఖమ్మం లోక్ సభ స్థానాన్ని కచ్చితంగా గెలుచుకోవాలని సూచన
  • కాంగ్రెస్ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందన్న కేటీఆర్
KTR says KCR is more powerful than CM

రానున్న రోజుల్లో కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి... సీఎం అనే రెండక్షరాల కంటే కేసీఆర్ అనే మూడు అక్షరాలే పవర్ ఫుల్ అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్‌లో మంగళవారం బీఆర్‌ఎస్ పార్టీ ఖమ్మం లోక్ సభ నియోజకవర్గ సన్నాహక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ... మనమంతా తెలంగాణ ఉద్యమం సమయంలో గట్టిగా పోరాడిన వాళ్లమేనని.. అసెంబ్లీ సమావేశాల్లోను మన పోరాట పటిమను చూపించామన్నారు.

ఇక ముందుముందు కేసీఆర్ సభకు వస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి అన్నారు. కేసీఆర్ ఫిబ్రవరిలో ప్రజల మధ్యకు వస్తున్నారన్నారు. పార్లమెంట్ నియోజకవర్గాల సమీక్షల తర్వాత అసెంబ్లీల వారీగా సమీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. త్వరలో రాష్ట్ర, జిల్లాస్థాయి కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇక ముందు ప్రతి మూడు నెలలకోసారి అన్ని కమిటీల సమావేశాలు ఉంటాయన్నారు.

ఖమ్మంలో అందరం కలిసి ముందుకు సాగుదామని... లోక్ సభ సీటును తప్పనిసరిగా గెలుచుకోవాల్సిందే అన్నారు. తెలంగాణ గళం... బలం బీఆర్ఎస్ మాత్రమే అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో మనం 39 సీట్లలో గెలిచామని... 11 స్థానాల్లో అతి తక్కువ మెజార్టీతో ఓడిపోయామన్నారు. మరికొన్ని స్థానాలలో ఓటమికి వివిధ కారణాలు ఉన్నాయని చెప్పారు. అన్నింటినీ సమీక్షించుకొని ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు.  

వచ్చిన మరుసటి రోజునే హామీలు అమలు చేస్తామన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నెల రోజులు దాటినా అమలు చేయడం లేదని విమర్శించారు. అధికార పార్టీ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందన్నారు. 1989లో అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్టీఆర్‌ను తిరస్కరించిన ప్రజలు కాంగ్రెస్‌కు అధికారం ఇచ్చారని.. కానీ అప్పుడు ఏడాదిన్నర లోపే కాంగ్రెస్ ప్రజల ఆదరణను కోల్పోయిందని.. అందుకే అప్పుడు లోక్ సభ ఎన్నికల్లో ఘోర పరాజయం పొందిందన్నారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి నెలకొందన్నారు.

More Telugu News