Kaleswaram: కాళేశ్వరంపై విజిలెన్స్ తనిఖీలు... పలు రికార్డుల స్వాధీనం

Vigilance searches in Kaleswaram
  • కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి అంటూ ఆరోపణలు
  • విచారణ జరిపిస్తామని అసెంబ్లీలో ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి
  • పలు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టిన విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ విభాగం
ఇంజినీరింగ్ అద్భుతం అని గత ప్రభుత్వం పేర్కొన్న కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందన్న ఆరోపణలు రావడం తెలిసిందే. కాళేశ్వరం వ్యవహారంలో నిగ్గు తేల్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ సర్కారు సిద్ధమైంది. ఇటీవల అసెంబ్లీలోనూ సీఎం రేవంత్ రెడ్డి దీనిపై ప్రకటన చేశారు. 

ఈ నేపథ్యంలో, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ విభాగం నేడు తనిఖీలు చేపట్టింది. ఈ తనిఖీల్లో 10 విజిలెన్స్, ఇంజినీరింగ్ బృందాలు పాల్గొన్నాయి. 

హైదరాబాద్ ఎర్రమంజిల్ లోని జలసౌధ భవనంలో ఉన్న కాళేశ్వరం ప్రాజెక్ట్ కార్పొరేషన్ కార్యాలయంలో తనిఖీలు చేపట్టిన విజిలెన్స్ అధికారులు ఫైళ్లను స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ ఇంజినీర్ ఇన్ చీఫ్ మురళీధర్ రావు కార్యాలయంలోనూ తనిఖీలు చేపట్టారు. 

కరీంనగర్ ఎల్ఎండీలోని నీటి పారుదల శాఖ కార్యాలయంలో తనిఖీలు చేసి కాళేశ్వరం, మేడిగడ్డ ప్రాజెక్టుల ఫైళ్లను పరిశీలించారు. జయశంకర్ జిల్లాలోని మహాదేవ్ పూర్ ఇరిగేషన్ డివిజన్ కార్యాలయాల్లోనూ విజిలెన్స్ తనిఖీలు జరిగాయి. ఈ తనిఖీల్లో మేడిగడ్డ, కన్నెపల్లి పంప్ హౌస్ కు చెందిన ఫైళ్లను పరిశీలించారు.
Kaleswaram
Vigilance And Enforcement
CM Revanth Reddy
Congress
BRS
Telangana

More Telugu News