Pawan Kalyan: ఏపీ ఎన్నికలను కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ గా తీసుకుంది: పవన్ కల్యాణ్

Pawan Kalyan talks to media after met CEC in Vijayawada
  • విజయవాడ వచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం
  • సీఈసీతో సమావేశమైన పవన్ కల్యాణ్, చంద్రబాబు
  • సమావేశం ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన నేతలు
  • ఈసారి ప్రభుత్వం మారిపోతుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నానన్న పవన్
టీడీపీ అధినేత చంద్రబాబుతో కలిసి విజయవాడలో కేంద్ర ఎన్నికల సంఘం సమావేశానికి హాజరైన జనసేనాని పవన్ కల్యాణ్... ఆ భేటీ ముగిశాక మీడియాతో మాట్లాడారు. ఏపీలో ఎన్నికలు పూర్తి ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలన్న ఉద్దేశంతోనే కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ విజయవాడ వచ్చి సమావేశం ఏర్పాటు చేసిందని పవన్ వెల్లడించారు. 

"చంద్రబాబు మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసి, విపక్ష నేతగా ఉన్నారు... ఆయన తన సుదీర్ఘ అనుభవంలో తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎన్నికలు ఎలా జరిగాయో సీఈసీకి చక్కగా వివరించారు. పారదర్శకంగా ఎన్నికలు జరగడానికి ఆయన శాయశక్తులా ఎలా కృషి చేశారో చెప్పారు. 

చంద్రగిరిలో లక్ష దొంగ ఓట్లు నమోదు చేస్తే వాటిలో నాలుగింట ఒక వంతు ఆమోదించారన్న విషయాన్ని సీఈసీ దృష్టికి తీసుకెళ్లాం. ఇక, జనసేన తరఫున కూడా అభ్యంతరాలను కేంద్ర ఎన్నికల సంఘానికి వివరించాం. వైసీపీ పాలన మొదలైనప్పటి నుంచి శాంతిభద్రతలు పూర్తిగా దిగజారిపోయాయని చెప్పాం. ప్రజాస్వామ్యానికి హాని కలుగుతుండడంపై ప్రశ్నిస్తే విపక్షాల వారిపై బైండోవర్ కేసులు పెడుతున్నారని వివరించాం. 

గత రెండు నెలలుగా రాష్ట్రంలో పోలీసు అధికారులను మార్చుతున్నారు. ఎన్నికల సమయానికి వారికి నచ్చిన పోలీసు అధికారులను కోరుకున్న చోట నియమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ విషయాన్ని కూడా సీఈసీకి గట్టిగా తెలియజేశాం. 

ఇక, వాలంటీర్లు రాజ్యాంగ విరుద్ధమైన వ్యవస్థ అని, వారిని ఎన్నికల ప్రక్రియలో పాలుపంచుకోకుండా నిరోధించాలని ప్రత్యేకంగా విన్నవించాం. ఎన్నికల సంఘం గనుక చర్యలు తీసుకోకపోతే ప్రజాస్వామ్యం ఖూనీ అయిపోతుందని, హింస పెరిగిపోతుందని చెప్పాం. స్థానిక ఎన్నికల్లో ఒక దళిత యువకుడు కనీసం నామినేషన్ వేసే పరిస్థితి కూడా లేకుండా పోయిందని తెలిపాం. 

మేం చెప్పింది ఎన్నికల సంఘం సావధానంగా వింది. ఎన్నికల ప్రధాన అధికారి ఒకటే చెప్పారు... మేం పారదర్శక ఎన్నికల నిర్వహణకు కట్టుబడి ఉన్నాం అని భరోసా ఇచ్చారు. ఏపీ ఎన్నికలను కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ గా తీసుకోవడం చూస్తుంటే... ఈసారి నికార్సయిన రీతిలో ఎన్నికలు జరిగి ప్రభుత్వం మారిపోతుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను" అంటూ పవన్ కల్యాణ్ వివరించారు.
Pawan Kalyan
Chandrababu
CEC
Vijayawada
Janasena
TDP
Andhra Pradesh

More Telugu News