Arjun Award: అర్జున అవార్డు దక్కడంపై పేసర్ మహ్మద్ షమీ ఆసక్తికర వ్యాఖ్యలు

  • అవార్డు దక్కడాన్ని ‘ఒక కల’గా అభివర్ణించిన స్టార్ పేసర్
  • ఈ అవార్డు కోసం చాలా మంది క్రీడాకారులు జీవితాంతం ఎదురుచూసినా ప్రేక్షకులుగానే మిగిలిపోతారని వ్యాఖ్య
  • నేడు షమీతోపాటు అర్జున అవార్డు స్వీకరించనున్న 25 మంది క్రీడాకారులు
Pacer Mohammed Shami interesting comments on getting Arjun Award

దేశంలో రెండవ అత్యున్నత క్రీడా పురస్కారం అర్జున అవార్డు దక్కడంపై టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. అవార్డు దక్కడాన్ని ఒక కలగా అభివర్ణించాడు. ‘‘ ఈ అవార్డు దక్కడం ఒక కల. జీవితకాలం మొత్తం గడిచిపోయినా చాలామందికి ఈ అవార్డు దక్కదు. నాకు దక్కడం పట్ల చాలా సంతోషంగా ఉన్నాను. చాలా గర్వపడుతున్నాను. చాలా మంది క్రీడాకారులు ఈ అవార్డు అందుకోవాలని ఎదురుచూస్తారు. కానీ ప్రేక్షకులుగా మిగిలిపోతారు. చాలా మందికి నెరవేరని కల ఇది’’ అని షమీ వ్యాఖ్యానించాడు. 

మంగళవారం (నేడు ) అర్జున అవార్డు స్వీకరించనున్న నేపథ్యంలో ఓ జాతీయ మీడియా సంస్థతో షమీ మాట్లాడాడు. ప్రస్తుతం గాయం కారణంగా ఆటకు దూరమైన షమీ బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో వైద్యనిపుణుల పర్యవేక్షణలో ఉన్నాడు. చీలమండ గాయం నుంచి కోలుకుంటున్నట్టు చెప్పాడు. ట్రైనింగ్ సెషన్లను కూడా మొదలుపెట్టానని, ఇంగ్లాండ్‌ టెస్ట్ సిరీస్ సమయానికి అందుబాటులోకి వస్తానని ఆశాభావం వ్యక్తం చేశాడు.

కాగా మంగళవారం అర్జున అవార్డు స్వీకరించనున్న 25 మంది క్రీడాకారుల్లో ఏకైక క్రికెటర్ మహ్మద్ షమీ కావడం గమనార్హం. ఇక బీసీసీఐ ప్రత్యేక అభ్యర్థన మేరకు షమీ పేరు అవార్డుకు నామినేట్ అయ్యింది. కాగా భారత్ వేదికగా గతేడాది ముగిసిన వన్డే వరల్డ్ కప్‌లో షమీ అద్భుతంగా రాణించాడు. కేవలం ఏడు మ్యాచ్‌లు ఆడి 24 వికెట్లు తీశాడు. టోర్నమెంట్‌లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా నిలిచాడు.

More Telugu News