Kollu Ravindra: జగన్ ఆ విషయంలో మాత్రం మాటకు కట్టుబడ్డాడు: కొల్లు రవీంద్ర వ్యంగ్యం

  • రా కదలిరా సభలకు జనాలు పోటెత్తుతున్నారన్న కొల్లు రవీంద్ర
  • సూపర్ సిక్స్ పథకాలకు విశేష ఆదరణ లభిస్తోందని వెల్లడి
  • జగన్, మంత్రులు ఓర్వలేకపోతున్నారని వ్యాఖ్యలు
Kollu Ravindra criticises CM Jagan

తాము చేపడుతున్న 'రా కదలిరా' సభలకు ప్రజలు పోటెత్తుతుండడం.. సూపర్ సిక్స్ పథకాలకు విపరీతమైన ఆదరణ లభిస్తుండడం చూసి జగన్ రెడ్డి, మంత్రులు ఓర్వలేకపోతున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర విమర్శించారు. అందుకే తమపై పిచ్చిప్రేలాపనలు పేలుతున్నారని మండిపడ్డారు.  

మాట తప్పను-మడమ తిప్పను, విశ్వసనీయతతో ఉంటానన్న జగన్... ప్రజల్ని రాష్ట్రాన్ని దోచుకునే విషయంలో మాత్రమే తనమాటకు కట్టుబడ్డాడని కొల్లు రవీంద్ర వ్యంగ్యం ప్రదర్శించారు. హామీల అమలుకు రోడ్డెక్కిన అంగన్ వాడీ సిబ్బందిపై ఎస్మా చట్టం ప్రయోగించడమేనా మాట తప్పకపోవడం అంటే? అని ప్రశ్నించారు.

"మాట తప్పకపోవడం అంటే రైతుఆత్మహత్యల్లో రాష్ట్రాన్ని దేశంలో తొలిస్థానంలో నిలపడమా? మడమ తిప్పకపోవడమంటే, మద్యనిషేధమని చెప్పి మహిళల తాళిబొట్లు తెంచడమా? తల్లిని, చెల్లిని రాష్ట్రం నుంచి తరిమేయడమేనా జగన్ రెడ్డి చెప్పిన విశ్వసనీయత?" అంటూ కొల్లు రవీంద్ర నిలదీశారు. 

మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో కొల్లు రవీంద్ర మీడియా సమావేశం నిర్వహించారు. రా కదలిరా కార్యక్రమం ద్వారా చంద్రబాబు రాష్ట్రంలోని ప్రజలతో మమేకమవుతున్నారని, టీడీపీ చేపట్టిన బహిరంగ సభలకు ప్రజలు భారీస్థాయిలో తరలి వచ్చి, ఈ అరాచక ప్రభుత్వ దుర్మార్గ పాలనను ఇకపై సహించేది లేదని గొంతెత్తుతున్నారని వివరించారు.

"ఒక్క ఛాన్స్ అని అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి అన్ని వర్గాల వారిని తీవ్రంగా వంచించాడు. రైతులు ఈ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని నమ్మి నిండా మునిగిపోయారు. రైతు ప్రభుత్వమంటూ రైతు ఆత్మహత్యల్లో రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రస్థానంలో నిలిపాడు. 

ఉద్యోగాలిస్తానని యువతను దారుణంగా వంచించి, కల్తీమద్యం, మాదక ద్రవ్యాలకు బానిసల్ని చేశాడు. ఏటా జాబ్ క్యాలెండర్ అని చెప్పి తన అవినీతిపత్రిక సాక్షి దినపత్రిక క్యాలెండర్లు విడుదల చేసుకున్నాడు. ఏటా డీఎస్సీ నిర్వహిస్తానని చెప్పి యువతను మోసగించాడు. పోలీస్ రిక్రూట్ మెంట్ సహా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి మంగళం పాడాడు. చంద్రబాబు హాయాంలో ఉపాధ్యాయ పోస్టులు భర్తీచేయడంతో పాటు,  ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో యువతకు దాదాపు 10లక్షల ఉద్యోగాలు ఇచ్చారు. 

సంక్షేమం ముసుగులో దోపిడీ చేస్తున్నాడు. గత టీడీపీ ప్రభుత్వం పేదలకు అందించిన 100కు పైగా సంక్షేమ పథకాలను రద్దు చేశాడు. ఇదీ... జగన్ అమలుచేసిన మోసకారీ సంక్షేమం. ప్రచారపిచ్చిలో జగన్ రెడ్డికి ఎవరూ సాటిరారు. సర్వేరాళ్లపై, రైతులకు అందించే పట్టాదార్ పాస్ పుస్తకాలపై, ఆఖరికి బాత్రూమ్ తలుపులు, గోడలపై కూడా తన బొమ్మలు ముద్రించుకుంటూ ప్రచారపిచ్చిలో తనకెవరూ సాటిరారని జగన్ రెడ్డి నిరూపించుకున్నాడు" అంటూ విమర్శనాస్త్రాలు సంధించారు.

మా 'సూపర్ సిక్స్' పథకాలు ప్రజల హృదయాల్లో నాటుకుపోయాయి

చంద్రబాబు ప్రకటించిన ‘సూపర్ సిక్స్’ పథకాలు ప్రజల హృదయాల్లో నాటుకు పోయాయని కొల్లు రవీంద్ర తెలిపారు. 

18 ఏళ్లు నిండిన ఆడబిడ్డకు ప్రతినెలా నెలకు రూ.1,500 ఆర్థికసాయం, చదువుకునే ప్రతివిద్యార్థికి తల్లికివందనం పథకం కింద సంవత్సరానికి రూ.15 వేలు, ప్రతి కుటుంబానికి ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం, ప్రతి ఇంటికీ సురక్షిత తాగునీరు, ప్రతి రైతుకి ఏటా రూ.20 వేల ఆర్థికసాయం, ప్రతి నిరుద్యోగికి నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి, బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం, రాబోయే ఐదేళ్లలో యువతకు 20లక్షల ఉద్యోగాల కల్పన వంటి చంద్రబాబు ప్రకటించిన గొప్ప పథకాలతో ప్రజాభిమానం టీడీపీవైపు కొట్టొచ్చినట్టు కనిపిస్తోందని కొల్లు రవీంద్ర సంతోషం వ్యక్తం చేశారు.

More Telugu News