Maldives: భారత్ పై వ్యాఖ్యలు చేసిన మాల్దీవుల నేతలు మూల్యం చెల్లించుకున్నారు!

  • లక్షద్వీప్ టూరిజంను ప్రోత్సహించేలా ప్రధాని మోదీ ట్వీట్
  • అక్కసు వెళ్లగక్కిన మాల్దీవుల నేతలు
  • తీవ్రంగా స్పందించిన భారత్ ప్రముఖులు, నెటిజన్లు
  • ఓ మంత్రిని, ఎంపీని సస్పెండ్ చేసిన మాల్దీవుల ప్రభుత్వం
Maldives reportedly suspends its leaders after heated comments on India

భారత ప్రధాని నరేంద్ర మోదీ లక్షద్వీప్ ను పర్యాటకంగా ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో ఓ ట్వీట్ చేయగా... మాల్దీవులకు చెందిన రాజకీయ నేతలు ఆ ట్వీట్ ను ఎద్దేవా చేశారు. భారత్ పై అవమానకర రీతిలో వ్యాఖ్యలు చేశారు. భారత్ పై వ్యాఖ్యలు చేసిన వారిలో మాల్దీవుల డిప్యూటీ మంత్రి మరియం షివునా, ఎంపీ జహీద్ రమీజ్ తదితరులు ఉన్నారు. 

మరియం ఏకంగా ప్రధాని మోదీని టార్గెట్ చేస్తూ ఓ ట్వీట్ చేసి కాసేపటికి ఆ ట్వీట్ తొలగించారు. మోదీ ఒక తోలుబొమ్మ అంటూ ఆమె వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై భారత్ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, సచిన్ టెండూల్కర్, హార్దిక్ పాండ్యా, వెంకటేశ్ ప్రసాద్ వంటి ప్రముఖులు మాల్దీవుల నేతల తీరును ఖండించారు. సోషల్ మీడియాలోనూ మాల్దీవులకు వ్యతిరేకంగా తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. 

దీనిపై మాల్దీవుల ప్రభుత్వం తీవ్రస్థాయిలో స్పందించింది. మంత్రి మరియంను, ఎంపీ జహీద్ రమీజ్ ను సస్పెండ్ చేసింది. ఈ మేరకు అక్కడి మీడియాలో కథనాలు వచ్చాయి. 

అంతకుముందు... మరియం షివునా, జహీద్ రమీజ్ చేసిన వ్యాఖ్యలను తమకు ఆపాదించవద్దని మాల్దీవుల ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆ వ్యాఖ్యలు వారి వ్యక్తిగతమని, వాటిని మాల్దీవుల ప్రభుత్వ వైఖరిగా భావించవద్దని భారత్ కు విజ్ఞప్తి చేసింది. 

తమ భాగస్వామ్య దేశాలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. చెప్పినట్టుగానే సదరు నేతలపై సస్పెన్షన్ వేటు వేసింది.

  • Loading...

More Telugu News