Adithya L-1: భారత అంతరిక్ష రంగంలో ఇది చారిత్రాత్మక ఘట్టం

  • లగ్రాంజ్ పాయింట్ కక్ష్యలోకి ప్రవేశించిన ఆదిత్య ఎల్-1
  • సూర్యుడిపై పరిశోధనల కోసం గతేడాది ఇస్రో ప్రయోగం
  • 127 రోజులు ప్రయాణించి లగ్రాంజ్ పాయింట్-1 ను చేరుకున్న ఆదిత్య
Adithya L1 enters into Lagrange Point 1 orbit

భగభగలాడే అగ్నిగుండం లాంటి సూర్యుడ్ని పరిశోధించేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఆదిత్య ఎల్-1 వ్యోమనౌకను పంపించడం తెలిసిందే. ఈ ప్రయోగంలో నేడు కీలక పరిణామం చోటుచేసుకుంది. 

చారిత్రాత్మక ఘట్టం అనదగ్గ రీతిలో ఆదిత్య ఎల్-1 భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని లగ్రాంజ్ పాయింట్-1 వద్ద ఉన్న సౌర కక్ష్యలోకి ప్రవేశించింది. ఈ లగ్రాంజ్ పాయింట్-1 నుంచి ఆదిత్య ఎల్-1 సూర్యుడి ఉపరితలం గురించి పరిశోధనలు చేపట్టనుంది.

గతేడాది సెప్టెంబరు 2న శ్రీహరికోట రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి ఆదిత్య ఎల్-1 నింగికి ఎగిసింది. ఈ వ్యోమనౌకను పీఎస్ఎల్వీ సి-57 రాకెట్ రోదసిలోకి మోసుకెళ్లింది. ఇవాళ లగ్రాంజ్ పాయింట్-1 వద్ద కక్ష్యలోకి చేరేంతవరకు ఆదిత్య స్పేస్ క్రాఫ్ట్ 127 రోజులు ప్రయాణించింది. ఇస్రో వివిధ విన్యాసాలతో ఆదిత్య ఎల్-1ను లగ్రాంజ్ పాయింట్-1 దిశగా తీసుకెళ్లింది. 

ఇందులోని హై ఎనర్జీ ఆర్బిటింగ్ ఎక్స్ రే స్పెక్ట్రోమీటర్ సూర్యుడిపై ప్రజ్వరిల్లే జ్వాలలను చిత్రీకరించింది. ఇక, సోలార్ విండ్ అయాన్ స్పెక్ట్రోమీటర్ సౌర గాలులను అధ్యయనం చేస్తుంది. ఆదిత్య ఎల్-1లోని సోలార్ అల్ట్రావయొలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్ ఇప్పటికే సూర్యుడి చిత్రాలను అతి చేరువ నుంచి చిత్రీకరించింది.

More Telugu News