David Warner: కెరీర్ లో చివరి టెస్టు ఆడేసిన వార్నర్... వీడ్కోలు సందర్భంగా కంటతడి

  • టెస్టు క్రికెట్లో ముగిసిన వార్నర్ శకం
  • పాకిస్థాన్ తో మూడో టెస్టుతో ఐదు రోజుల క్రికెట్ కు వార్నర్ గుడ్ బై
  • విజయంతో టెస్టు కెరీర్ కు వీడ్కోలు పలికిన డాషింగ్ ఓపెనర్
David Warner gets emotional after his final test in career

ఆస్ట్రేలియా విధ్వంసక ఓపెనర్ డేవిడ్ వార్నర్ టెస్టు కెరీర్ ముగిసింది. ఇటీవల టెస్టులకు, వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించిన వార్నర్... నేడు కెరీర్ లో చివరి టెస్టు ఆడేశాడు. ఆస్ట్రేలియా-పాకిస్థాన్ జట్ల మధ్య ఇవాళ మూడో టెస్టు ముగిసింది. ఈ టెస్టుతో ఐదు రోజుల క్రికెట్లో వార్నర్ శకం ముగిసింది. సిడ్నీలో జరిగిన ఈ పోరులో ఆసీస్ 8 వికెట్ల తేడాతో నెగ్గి వార్నర్ కు ఘనమైన కానుక ఇచ్చింది. 

మ్యాచ్ అనంతరం వార్నర్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. మీడియాతో మాట్లాడుతూ కంటతడి పెట్టుకున్నాడు. గెలుపుతో కెరీర్ ముగించాలనుకున్న తన కల నిజమైందని అన్నాడు. కొందరు దిగ్గజ క్రికెటర్లతో కలిసి ఆస్ట్రేలియా జట్టు తరఫున ఆడే అవకాశం లభించడం తన అదృష్టమని వార్నర్ తెలిపాడు. 

ఇక, ఆసీస్ జట్టు గత రెండేళ్లుగా అద్భుతమైన క్రికెట్ ఆడుతోందని కొనియాడాడు. ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ గెలవడం, యాషెస్ సిరీస్ ను డ్రా చేసుకోవడం, ప్రతిష్ఠాత్మక వన్డే వరల్డ్ కప్ ను చేజిక్కించుకోవడం తన కెరీర్ ను చిరస్మరణీయంగా మార్చేసినట్టు వెల్లడించాడు. ఈ విజయాల్లో తాను కూడా భాగం కావడం పట్ల గర్విస్తున్నానని వార్నర్ పేర్కొన్నాడు. 

37 ఏళ్ల వార్నర్ తన సుదీర్ఘ టెస్టు కెరీర్ లో 112 మ్యాచ్ లు ఆడి 44.59 సగటుతో 8,786 పరుగులు సాధించాడు. అందులో 26 సెంచరీలు, 37 అర్ధసెంచరీలు ఉన్నాయి. టెస్టుల్లో వార్నర్ అత్యధిక వ్యక్తిగత స్కోరు 335 పరుగులు. ఎడమచేతివాటం వార్నర్ 2011 డిసెంబరు 1న న్యూజిలాండ్ తో మ్యాచ్ ద్వారా తన టెస్టు కెరీర్ ప్రారంభించాడు. 

వార్నర్ కెరీర్ లో బాల్ టాంపరింగ్ అంశం ఓ మచ్చలా మిగిలిపోతుంది. దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ సందర్భంగా బంతి రూపురేఖలు మార్చినట్టు తేలడంతో అప్పట్లో వార్నర్ నిషేధం ఎదుర్కొన్నాడు. 

వార్నర్ కు ఐపీఎల్ ద్వారా ఎంతోమంది అభిమానులు ఏర్పడ్డారు. సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ కు ఆడడంతో వార్నర్ ను తెలుగువాళ్లు విశేషంగా అభిమానిస్తుంటారు. వార్నర్ కూడా తెలుగు సినిమాలపై మోజు పెంచుకుని, టిక్ టాక్ వీడియోలతో అభిమానులను అలరిస్తుంటాడు. వార్నర్ కు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.

More Telugu News