challan: పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల చెల్లింపునకు గడువు మరో నాలుగు రోజులే...!

  • ఈ నెల 10వ తేదీ వరకే రాయితీతో కూడిన చలాన్ల చెల్లింపునకు గడువు
  • ఇప్పటి వరకు 76.79 లక్షల చలాన్ల చెల్లింపులు
  • రాయితీతో ఇప్పటి వరకు జరిగిన చెల్లింపులు రూ.66.77 కోట్లు
Massive discount on traffic challans

తెలంగాణలో పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల చెల్లింపునకు రాయితీ గడువు మరో నాలుగు రోజులు మాత్రమే ఉంది. ఈ నెల 10వ తేదీ వరకు రాయితీతో పెండింగ్ చలాన్లను చెల్లించవచ్చు. రాయితీ నేపథ్యంలో వాహనదారుల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. డిసెంబరు 26 నుంచి ఇప్పటి వరకు 76.79 లక్షల చలాన్లకు సంబంధించి రూ.66.77 కోట్ల చెల్లింపులు జరిగాయి. 

ద్విచక్ర వాహనాలు, ఆటోలకు 80 శాతం, ఫోర్ వీలర్లకు 60 శాతం, ఆర్టీసీ బస్సులు, తోపుడు బండ్లపై 90 శాతం, భారీ వాహనాలపై 50 శాతం రాయితీని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.

తెలంగాణ రాష్ట్రంలో 2 కోట్లకు పైగా చలాన్లు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో ఉన్నతాధికారులు రాయితీని ప్రకటిస్తూ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. గత ఏడాది రాయితీ ప్రకటనతో 45 రోజుల్లోనే ఏకంగా రూ.300 కోట్ల ఆదాయం సమకూరింది. 

ట్రాఫిక్ చలాన్లకు సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే 040-27852721, 8712661690 (వాట్సాప్) నంబర్లలో సంప్రదించాలని పోలీసులు సూచించారు. మీసేవ, పేటీఎం, టీ వ్యాలెట్‌, నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లింపులు జరపవచ్చు. అయితే, ఫేక్ చలానా వెబ్ సైట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.

More Telugu News