Pakistan Elections: పాక్‌లో సార్వత్రిక ఎన్నికల వాయిదా

  • వాయిదా తీర్మానానికి సెనెట్ ఆమోదం
  • భద్రతా సమస్యలు, వాతావరణ కారణాలతో వాయిదా వేస్తున్నట్టు తీర్మానంలో ప్రస్తావన
  • ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికల నిర్వహణ ప్రాథమిక హక్కుల ఉల్లంఘన అవుతుందన్న సెనెట్
Pakistan Senate Approves Resolution To Delay February 8 Elections

పాక్‌లో సార్వత్రిక ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఫిబ్రవరి 8న జరగాల్సిన ఎన్నికలను భద్రతాపరమైన కారణాలు, వాతావరణ పరిస్థితుల రీత్యా వాయిదా వేసేందుకు పాక్ సెనెట్ నిర్ణయించింది. ఈ మేరకు సెనెట్‌లో ప్రవేశపెట్టిన తీర్మానానికి మెజారిటీ సభ్యులు ఆమోదం తెలిపారు. సెనెటర్ దిలావర్ ఖాన్ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా సమాచార శాఖ మంత్రి ముర్తజా సోలంగీ, పీఎమ్ఎల్-ఎన్ సెనెటర్ అఫ్నన్ ఉల్లాహ్ దీన్ని వ్యతిరేకించారు. 

ప్రజలకు రాజ్యాంగం ఓటు హక్కు కల్పించిందని, స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాల్సి ఉందని తీర్మానంలో ప్రస్తావించారు. అన్ని ప్రాంతాల వారు ఎన్నికల్లో పాల్గొనేలా చూడాలని పేర్కొన్నారు. పాక్‌లో చలి తీవ్రత ఎక్కువగా ఉండే జనవరి, ఫిబ్రవరి మాసాల్లో బలొచిస్థాన్, ఖైబర్ ఫాఖ్తూన్‌ఖ్వా ప్రావిన్సుల్లో ఓటర్ల స్పందన తక్కువగా ఉండొచ్చని తీర్మానంలో అభిప్రాయపడ్డారు. ఈ విషయమై పలు రాజకీయ పార్టీలు ఆందోళన వ్యక్తం చేసిన విషయాన్ని కూడా తీర్మానంలో ప్రస్తావించారు.

ఇటీవలి ఉగ్రదాడుల నేపథ్యంలో ప్రచారంలో పాల్గొనే రాజకీయ నాయకుల భద్రతపై కూడా తీర్మానంలో ఆందోళన వ్యక్తమైంది. ప్రముఖ నాయకులకు ప్రమాదం పొంచి ఉందని అంతర్గత వ్యవహారాల శాఖ హెచ్చరికలను కూడా తీర్మానంలో పేర్కొన్నారు. ఖైబర్ పాఖ్తూన్‌ఖ్వా, బలొచిస్థాన్‌లో ఉగ్రదాడులు పెరిగిన వైనాన్నీ ప్రస్తావించారు. ఈ సమస్యలను పరిష్కరించకుండా ఎన్నికలను నిర్వహించడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని సెనెట్ అభిప్రాయపడింది. ఈ మేరకు ఎన్నికల వాయిదా తీర్మానానికి మెజారిటీ సభ్యులు అనుకూలంగా ఓటు వేశారు.

More Telugu News