Lok Sabha elections 2024: లోక్‌సభ ఎన్నికలకు అభ్యర్థుల ఎంపిక కోసం స్క్రీనింగ్ కమిటీలు ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ

Congress party announced screening committees for selection of candidates for Lok Sabha elections 2024
  • అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేయడమే లక్ష్యంగా కమిటీల ఏర్పాటు
  • అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను 5 క్లస్టర్లుగా విభజించి చైర్మన్, సభ్యులను ప్రకటించిన హస్తం పార్టీ
  • అఖిల భారత కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలిగా అల్కా లాంబా నియామకం
వచ్చే లోక్‌సభ ఎన్నికలకు అభ్యర్థులను ఎంపిక చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ కీలక ముందడుగు వేసింది. అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేయడానికి క్లస్టర్ల వారీగా స్క్రీనింగ్ కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ మేరకు హస్తం పార్టీ శుక్రవారం ప్రకటన చేసింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు లేదా ఇన్‌చార్జ్‌లు, పీసీసీ అధ్యక్షులు, సీఎల్‌పీ నేతలు, రాష్ట్ర లేదా కేంద్రపాలిత ప్రాంత ఇన్‌చార్జ్‌లుగా ఉన్న ఏఐసీసీ కార్యదర్శులు ఈ స్ర్కీనింగ్ కమిటీల్లో ఎక్స్-అఫిషియల్ సభ్యులుగా ఉంటారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటించారు.

క్లస్టర్ 1లో తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, లక్షద్వీప్, పుదుచ్చేరిలు ఉన్నాయి. ఈ క్లస్టర్ స్క్రీనింగ్ కమిటీకి హరీష్ చౌదరి ఛైర్మన్‌గా వ్యవహరించనుండగా విశ్వజీత్ కదమ్, జిగ్నేష్ మేవానీ సభ్యులుగా ఉన్నారు. క్లస్టర్ 2లో ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, గోవా, ఒడిశా, అండమాన్ - నికోబార్ దీవులు ఉన్నాయి. ఈ స్క్రీనింగ్ కమిటీకి మధుసూదన్ మిస్త్రీ చైర్మన్‌గా సూరజ్ హెగ్డే, షఫీ పరంబిల్ సభ్యులుగా ఉన్నారు. ఇక గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, ఢిల్లీ, డామన్ - డయ్యూ, దాద్రా -నగర్ హవేలీ మూడవ క్లస్టర్‌లో ఉన్నాయి. రజనీ పాటిల్ దీనికి ఛైర్మన్‌గా వ్యవహరించనుండగా కృష్ణ అల్లవూరు, పర్గత్ సింగ్ సభ్యులుగా ఉన్నారు.

క్లస్టర్ 4లో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, చండీగఢ్, జమ్మూ కశ్మీర్, లడఖ్ ఉన్నాయి. క్లస్టర్ 5లో బీహార్, ఝార్ఖండ్, పశ్చిమ బెంగాల్, అసోం, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మిజోరాం, మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర, సిక్కిం ఉన్నాయి. మరోవైపు అఖిల భారత కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలిగా సీనియర్ నాయకురాలు అల్కా లాంబాను ఆ పార్టీ నియమించింది.
Lok Sabha elections 2024
Congress
Screening committees
election
Rahul Gandhi
KC venugopal

More Telugu News