T20 World Cup: టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ విడుదల... ఒకే గ్రూపులో భారత్, పాకిస్థాన్

  • జూన్ 1 నుంచి టీ20 వరల్డ్ కప్
  • అమెరికా, వెస్టిండీస్ సంయుక్త ఆతిథ్యం
  • ఈసారి వరల్డ్ కప్ లో రికార్డు స్థాయిలో 20 జట్లు
  • గ్రూప్ మ్యాచ్ లన్నింటినీ అమెరికా గడ్డపై ఆడనున్న భారత్
ICC released T20 World Cup Schedule

క్రికెట్ ప్రేమికులను అలరించేందుకు మరో మెగా టోర్నీకి రంగం సిద్ధమవుతోంది. వెస్టిండీస్, అమెరికా దేశాలు సంయుక్తంగా నిర్వహించనున్న టీ20 వరల్డ్ కప్ కు నేడు షెడ్యూల్ విడుదల చేశారు. జూన్ 1 నుంచి 29వ తేదీ వరకు ఈ ఐసీసీ వరల్డ్ కప్ టోర్నీ జరగనుంది. ఈసారి టీ20 వరల్డ్ కప్ కు ఓ విశిష్టత ఉంది. మునుపెన్నడూ లేని విధంగా ఏకంగా 20 జట్లు తలపడనున్నాయి. ఈ టోర్నీలో క్వాలిఫయర్ టీమ్ లు సందడి చేయనున్నాయి. 

ఇక వరల్డ్ కప్ అంటే అందరూ ఆశించేది భారత్, పాకిస్థాన్ క్రికెట్ సమరాన్నే. ఈ టోర్నీలో దాయాది జట్లు రెండూ ఏ-గ్రూపులో ఉన్నాయి. జూన్ 9న న్యూయార్క్ నగరంలో ఈ రెండు జట్ల మ్యాచ్ జరగనుంది. ఏ-గ్రూపులో భారత్, పాక్ తో పాటు ఐర్లాండ్, అమెరికా, కెనడా జట్లు ఉన్నాయి. టీమిండియా తన గ్రూప్ మ్యాచ్ లు అన్నింటినీ అమెరికా గడ్డపైనే ఆడనుంది. 


టోర్నీలో పాల్గొనే జట్లు ఇవిగో...

గ్రూప్-ఏ: భారత్, పాకిస్థాన్, ఐర్లాండ్, కెనడా, అమెరికా
గ్రూప్-బి: ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, నమీబియా, స్కాట్లాండ్, ఒమన్
గ్రూప్-సి: న్యూజిలాండ్, వెస్టిండీస్, ఆఫ్ఘనిస్థాన్, ఉగాండా, పాపువా న్యూ గినియా
గ్రూప్-డి: దక్షిణాఫ్రికా, శ్రీలంక, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్, నేపాల్

ఈ గ్రూపుల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన మొత్తం ఎనిమిది జట్లు రెండో రౌండ్ కు అర్హత సాధిస్తాయి. వీటిని గ్రూప్-1, గ్రూప్-2గా విభజిస్తారు. ఈ రెండు గ్రూపుల నుంచి నాలుగు జట్లు సెమీస్ కు చేరుకుంటాయి. ఫైనల్ మ్యాచ్ జూన్ 29న వెస్టిండీస్ లోని బార్బడోస్ లో జరగనుంది. ఈసారి టోర్నీలో ఉగాండా, పాపువా న్యూ గినియా వంటి పసికూన జట్లు కూడా ఆడుతున్నాయి.

More Telugu News