Nara Bhuvaneswari: అధైర్యపడొద్దు... మీకు మేమున్నాం: మృతి చెందిన టీడీపీ కార్యకర్తల కుటుంబాలకు నారా భువనేశ్వరి భరోసా

  • నిజం గెలవాలి పేరిట నారా భువనేశ్వరి ఉత్తరాంధ్ర పర్యటన 
  • చంద్రబాబు అరెస్ట్ అనంతరం మరణించిన కార్యకర్తల కుటుంబాలకు పరామర్శ
  • ఒక్కో కుటుంబానికి రూ.3లక్షల ఆర్థికసాయం
  • నేటితో ముగిసిన నారా భువనేశ్వరి మూడ్రోజుల పర్యటన
Nara Bhuvaneswari gives assurance to deceased TDP workers family members

కుటుంబ పెద్దలను కోల్పోయి శోకసంద్రంలో మునిగిన టీడీపీ కార్యకర్తల కుటుంబాలకు అధైర్యపడొద్దు... మీకు మేమున్నామంటూ టీడీపీ అధినేత చంద్రబాబు అర్ధాంగి నారా భువనేశ్వరి భరోసా ఇచ్చారు. నారా భువనేశ్వరి 'నిజం గెలవాలి' పేరిట ఉత్తరాంధ్ర పర్యటనలో పర్యటిస్తున్న సంగతి  తెలిసిందే. 

అందులో భాగంగా నేడు 3వ రోజు విశాఖపట్నం, గాజువాకలో పర్యటించారు. చంద్రబాబు అరెస్టు అనంతరం ఆకస్మిక మరణానికి గురైన కార్యకర్తల కుటుంబాలను భువనేశ్వరి పరామర్శించారు. నోవాటెల్ విడిది కేంద్రం నుండి ప్రారంభమైన భువనేశ్వరి మొదటగా విశాఖ సౌత్ నియోజకవర్గంలోని 47వ వార్డులో టీడీపీ కార్యకర్త జాగరపు చిన్నా(47) కుటుంబాన్ని పరామర్శించారు. చిన్నా అక్టోబరు 3న గుండెపోటుతో మరణించారు. చిన్నా భార్య గౌరి, కుమార్తెలు దేవి, నందిని, కుమారుడు కిరణ్ లను భువనేశ్వరి పరామర్శించి ఓదార్చారు. కుటుంబ పెద్ద లేరని అధైర్య పడొద్దు... మీకు పార్టీ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. బాధిత కుటుంబానికి రూ.3 లక్షల చెక్కు అందించి ఆర్థికసాయం చేశారు. 

అనంతరం 41వ వార్డులోని మలిశెట్టి రమణ(55) కుటుంబాన్ని పరామర్శించారు. రమణ 2023 అక్టోబర్ 9న గుండెపోటుతో మృతిచెందారు. వారి కుమారుడు రాజు, కోడలు సంతోషి, కుటుంబ సభ్యులను భువనేశ్వరి ఓదార్చారు. కార్యకర్తల కుటుంబాలకు పార్టీ అన్నివేళలా అండగా నిలుస్తుందని ధైర్యం చెప్పారు. వారికి రూ.3 లక్షల చెక్కు అందించి ఆర్థికసాయం అందించారు. 

విశాఖ నార్త్ నియోజకవర్గంలోని 45వ వార్డులో పంచిరెడ్డి కనకారావు(52) కుటుంబాన్ని భువనేశ్వరి పరామర్శించారు. కనకారావు 2023 సెప్టెంబర్ 13న గుండెపోటుతో మరణించారు. వారి భార్య పార్వతి, కుమార్తె ఉదయశ్రీ, కుమారుడు శ్యామ్ లను భువనేశ్వరి పరామర్శించి, వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులని, వారికి పార్టీ అండగా నిలబడుతుందని ధైర్యం చెప్పారు. ఆ కుటుంబానికి రూ.3 లక్షల చెక్కు అందించి ఆర్థికసాయం చేశారు. 

భోజన విరామం అనంతరం గాజువాక నియోజకవర్గంలోని బాధిత కుటుంబాలను భువనేశ్వరి పరామర్శించారు. మొదటగా గాజువాక 65వ వార్డులోని కోరుకొండ వెంకటరమణ(61) కుటుంబాన్ని భువనేశ్వరి పరామర్శించారు. వెంకటరమణ భార్య మంగ, కుమారుడు శ్రీను, కుమార్తె లక్ష్మిలతో మాట్లాడి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబానికి రూ.3 లక్షల చెక్కు అందించి ఆర్థికసాయం చేశారు. 

అనంతరం గాజువాక 65వ వార్డులోని ఉప్పలపాటి సరోజిని కుటుంబాన్ని కూడా పరామర్శించారు. సరోజిని భర్త వెంకట అప్పల నరసింహరాజు, కుమారుడు శ్రీనివాసరాజు, కోడలు సునీత, కుమార్తె లక్ష్మిలతో మాట్లాడి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. వారి కుటుంబ సభ్యులకు రూ.3 లక్షల చెక్కు ఇచ్చి, ఆర్థికసాయం అందించారు. 

69వ వార్డులోని పమిడిముక్కల రాధాకృష్ణమూర్తి కుటుంబాన్ని పరామర్శించారు. రాధాకృష్ణమూర్తి కుమారులు వెంకట్రావు, ప్రభాకర్, కోడళ్లు స్వరాజ్యలక్ష్మి, శశికళలతో మాట్లాడి వారిని ఓదార్చారు. పార్టీ అన్ని విధాలా అండగా నిలబడుతుందని ధైర్యం చెప్పారు. వారి కుటుంబానికి కూడా రూ.3 లక్షల ఆర్థిక సాయం అందించారు. బాధిత కుటుంబాల పరామర్శ అనంతరం విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుని హైదరాబాద్ వెళ్లారు.

More Telugu News