Thummala: రేపటితో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ముగుస్తోంది: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

  • కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పించిందన్న తుమ్మల
  • ప్రజల వద్దకే పాలన తీసుకుపోవాలనే ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడి
  • రేపు చివరి రోజు కాబట్టి పంచాయతీ లేదా వార్డు కార్యాలయాల్లో దరఖాస్తులు ఇవ్వాలని సూచన
Minister Thummala Nageswara Rao on Prajapalana

కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పించిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మంలోని 54వ డివిజన్‌లో శుక్రవారం నిర్వహించిన ప్రజాపాలన - అభయహస్తం దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రజలవద్దకే పాలన తీసుకుపోవాలనే ఉద్దేశంతో తమ ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహిస్తోందన్నారు. రేపటితో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ముగుస్తుందని గుర్తు చేశారు. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని వారు చివరి రోజైన శనివారం తమ తమ గ్రామ పంచాయతీ కార్యాలయాలు లేదా పట్టణాలలోని వార్డు కార్యాలయాల్లో అధికారులకు దరఖాస్తులను అందించవచ్చునని సూచించారు.

ఆరు గ్యారెంటీల అమలుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రభుత్వం ఏర్పడిన రెండు రోజులకే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించామని గుర్తు చేశారు. అలాగే రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచామన్నారు. మిగతా పథకాల లబ్ధి కోసం ప్రజలు ఆందోళన చెందవద్దని... అర్హులైతే మీ ఇంటికే పథకాలు నడిచివస్తాయని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా తుమ్మల పలువురు దరఖాస్తుదారులతో ముచ్చటించారు.

More Telugu News