Pawan Kalyan: వారసత్వంగా వచ్చిన భూమిలో జగన్ బొమ్మతో రాళ్లు ఎందుకో అర్థం కావడం లేదు: పవన్ కల్యాణ్

  • న్యాయవాదులతో సమావేశమైన పవన్ కల్యాణ్
  • ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చర్చ
  • పట్టా పుస్తకాల్లో జగన్ ఫొటో ఎందుకన్న జనసేనాని
  • రాజ్యాంగం ప్రకారం వెళ్లేవారు ఇలాంటి పనులు చేయరని వ్యాఖ్యలు
Pawan Kalyan slams CM Jagan

నేను ఇచ్చేవాడ్ని, మీరు తీసుకునేవాళ్లు... అందరూ నాకు లోబడి ఉండాలి అనే మైండ్ సెట్ జగన్ ది అంటూ జనసేనాని పవన్ కల్యాణ్ విమర్శనాస్త్రాలు సంధించారు. పవన్ కల్యాణ్ ఇవాళ మంగళగిరిలోని జనసేన ప్రధాన కార్యాలయంలో న్యాయవాదులతో సమావేశం అయ్యారు. 

ఏపీ ప్రభుత్వం తీసుకువచ్చిన ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై న్యాయవాదులు పవన్ కు వివరించారు. దీనిపై పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వారసత్వంగా వచ్చే భూమిలో జగన్ బొమ్మతో రాళ్లు ఏమిటో అర్థం కావడంలేదని అన్నారు. 

"పట్టా పుస్తకాల్లో జగన్ ఫొటో అవసరమా? రాజ్యాంగం ప్రకారం నడుచుకునేవారిలో ఇలాంటి ఆలోచనలు ఉండవు, ఇటువంటి పనులు చేయరు" అని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఆస్తులు దోచుకోవడాన్ని సులభతరం చేసేందుకే ఈ చట్టం తీసుకువచ్చినట్టుందని విమర్శించారు. 

ఈ భూ హక్కు చట్టాన్ని రాష్ట్రపతి ఆమోదం కోసం పంపారని, కానీ ఇందులోని అంశాలను ముందుగానే అమలు చేస్తున్నారని పవన్ కల్యాణ్ ఆరోపించారు. అయితే, ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లోని అంశాలు న్యాయవాదులకు అర్థమైనంత సులభంగా సామాన్య ప్రజలకు అర్థం కావని, అందుకే దీని గురించి అందరికీ అర్థమయ్యేలా చెప్పాల్సిన అవసరం మనపై ఉందని అన్నారు. 

ఈ చట్టాన్ని రెండ్రోజుల పాటు పూర్తిగా అధ్యయనం చేస్తానని పవన్ చెప్పారు. ఆ తర్వాత, చట్టంలోని విషయాలను ప్రతి ఒక్కరికీ అర్థమయ్యేలా సాధారణ పరిభాషలో వివరిస్తానని పేర్కొన్నారు.

More Telugu News