TTD: అయోధ్య రామయ్య కోసం తిరుమల వెంకన్న కానుకగా లక్ష లడ్డూలు

  • అయోధ్యలో తుది మెరుగులు దిద్దుకుంటున్న రామ మందిరం
  • జనవరి 22న ప్రాణ ప్రతిష్ట
  • అయోధ్యకు భారీ కానుక పంపుతున్న టీటీడీ
  • ఒక్కో లడ్డూ బరువు 25 గ్రాములు ఉంటుందన్న ఈవో ధర్మారెడ్డి
TTD will send one lakh laddus for Ayodhya Ram Mandir

అయోధ్యలో జనవరి 22న అత్యంత ప్రతిష్ఠాత్మక రీతిలో రామ మందిరం ప్రాణప్రతిష్ట కార్యక్రమం జరగనుంది. అందుకోసం, తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అయోధ్యకు విశిష్టమైన కానుక పంపుతోంది. అయోధ్య రాముడి కోసం తిరుమల నుంచి లక్ష లడ్డూలు పంపనున్నారు. ఈ మేరకు టీటీడీ ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. అయోధ్య పంపించే లడ్డూలు ఒక్కొక్కటి 25 గ్రాముల బరువు ఉంటాయని తెలిపారు. 

తిరుమల అన్నమయ్య భవన్ లో ఇవాళ 'డయల్ యువర్ ఈవో' కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈవో ధర్మారెడ్డి మాట్లాడుతూ, సనానత హైందవ ధర్మ అభివృద్ధికి టీటీడీ కట్టుబడి ఉందని పేర్కొన్నారు. సనాతన హైందవ ధర్మ ప్రచారంలో భాగంగా తిరుమలలో ఫిబ్రవరి 3 నుంచి 5వ తేదీ వరకు ధార్మిక సదస్సు నిర్వహిస్తున్నుట్టు వెల్లడించారు. ఈ సదస్సుకు దేశంలోని ప్రముఖ ధార్మిక సంస్థల ప్రతినిధులు, పీఠాధిపతులు, మఠాధిపతులు హాజరవుతారని ధర్మారెడ్డి వివరించారు. 

ఇక, ధనుర్మాస కార్యక్రమాల ముగింపు నేపథ్యంలో, జనవరి 15న తిరుపతిలోని టీటీడీ కార్యాలయం వద్ద శ్రీ గోదా కల్యాణం నిర్వహిస్తున్నామని... జనవరి 16న కనుమ పండుగను పురస్కరించుకుని స్వామివారి పార్వేట ఉత్సవం జరుపుతున్నామని తెలిపారు. 

అటు, శ్రీవారి భక్తులు నకిలీ వెబ్ సైట్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని.... దర్శనాలు, వసతి, ఆర్జిత సేవలు, విరాళాల కోసం టీటీడీ అధికారిక వెబ్ సైట్  https://ttdevasthanams.ap.gov.in ను మాత్రమే సందర్శించాలని సూచించారు.

More Telugu News