Ponnam Prabhakar: జీహెచ్ఎంసీ పరిధిలో 10 లక్షల దరఖాస్తులు స్వీకరించాం: మంత్రి పొన్నం ప్రభాకర్

  • ఉచిత విద్యుత్, పెన్షన్, మహాలక్ష్మి, సబ్సిడీ గ్యాస్‌లకు సంబంధించి ఎక్కువగా దరఖాస్తులు వచ్చినట్లు వెల్లడి
  • ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను ఆమలులోకి తెస్తున్నామని వెల్లడి
  • తమ ప్రభుత్వం ప్రతి ఇంటి నుంచి దరఖాస్తును స్వీకరిస్తోందన్న మంత్రి
Minister Ponnam Prabhakar says 10 laksh applications received in GHMC

ప్రజాపాలన అభయహస్తం కింద జీహెచ్ఎంసీ పరిధిలో రూ.10 లక్షల దరఖాస్తులు స్వీకరించినట్లు హైదరాబాద్ జిల్లా ఇంఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. బుధవారం ముషీరాబాద్ సర్కిల్ భోలక్‌పూర్ వార్డులోని అంజుమన్ స్కూల్లో నిర్వహించిన దరఖాస్తు స్వీకరణ కౌంటర్‌ను కమిషనర్ రోనాల్డ్ రోస్, జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టితో కలిసి మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఇందిరమ్మ ఇల్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, పెన్షన్, మహాలక్ష్మీ, సబ్సిడీ గ్యాస్‌లకు సంబంధించిన దరఖాస్తులు అందాయని తెలిపారు.

ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు పూర్తయిందని... ఈ సమయంలోనే ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను ఆమలులోకి తెస్తున్నామన్నారు. ప్రభుత్వం ఏర్పడిన 45 గంటల్లో మహాలక్ష్మీ పథకాన్ని అమల్లోకి తెచ్చామన్నారు. ఇప్పటి వరకు ఆరున్నర కోట్ల మంది ఉచిత ఆర్టీసీ ప్రయాణాన్ని వినియోగించుకున్నట్లు వెల్లడించారు. తమ ప్రభుత్వం ప్రతి ఇంటి నుంచి దరఖాస్తును స్వీకరిస్తోందన్నారు. ఆరు గ్యారెంటీ పథకాలతో పాటు రేషన్ కార్డు, బస్తీ సమస్యల దరఖాస్తులను కూడా సమర్పించవచ్చునని స్పష్టం చేశారు. జీహెచ్ఎంసీ వ్యాప్తంగా 150 వార్డులలో 600 కేంద్రాల్లో దరఖాస్తుల స్వీకరణకు కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అవసరమైతే మరిన్ని కౌంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు.

More Telugu News