Saleh al-Aruri: హమాస్‌కు భారీ ఎదురుదెబ్బ.. ఇజ్రాయెల్ దాడుల్లో అగ్రనేత హతం

  • లెబనాన్ రాజధాని బీరుట్ శివారు ప్రాంతాల్లో ఇజ్రాయెల్ డ్రోన్ దాడులు
  • దాడిలో మొత్తం ఆరుగురి హతం
  • ఇజ్రాయెల్ దాడిపై తీవ్రంగా స్పందించిన లెబనాన్ ప్రధాని
  • తమను కూడా యుద్ధంలోకి లాగాలని ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం
Hamas deputy chief Aruri killed in Israel drone strikes

ఇజ్రాయెల్‌తో జరుగుతున్న యుద్ధంలో హమాస్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. లెబనాన్ రాజధాని బీరుట్ శివారు ప్రాంతాలపై నిన్న ఇజ్రాయెల్ జరిపిన డ్రోన్ దాడిలో హమాస్ అగ్రనేత, ఆ సంస్థ మిలిటెంట్ విభాగం వ్యవస్థాపకుల్లో ఒకడైన సలేహ్ అరౌరీ మృతి చెందాడు. ఈ దాడిలో మొత్తం ఆరుగురు మృతి చెందగా వారిలో అరౌరీ కూడా ఉన్నట్టు లెబనాన్ అధికారిక వార్తా సంస్థ తెలిపింది. ప్రాణాలు కోల్పోయిన మిగతా ఐదుగురు అరౌరీ అంగరక్షకులుగా తెలుస్తోంది. 

అరౌరీ హత్యతో యుద్ధం తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఉగ్రవాద సంస్థ హెజ్‌బొల్లాకు గట్టి పట్టున్న దక్షిణ బీరుట్ శివారులో ఈ ఘటన జరగడంపై ఆ దేశ ఆపద్ధర్మ ప్రధాని నజీబ్ మికాతీ తీవ్రంగా స్పందించారు.  తమను కూడా యుద్ధంలోకి లాగాలని ఇజ్రాయెల్ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. ఇజ్రాయెల్‌తో జరుగుతున్న యుద్ధంలో హమాస్‌కు హెజ్‌బొల్లా మొదటి నుంచీ మద్దతుగా నిలుస్తోంది. 

అరౌరీ మృతి చెందిన విషయాన్ని హమాస్ సంస్థ నిర్ధారించింది. గాజాలోని హమాస్ కమాండర్లను హతమార్చినట్టు గతంలో చెప్పిన ఇజ్రాయెల్.. హై ప్రొఫైల్ ఫిగర్‌ను చంపాల్సి ఉందని ప్రకటించింది. ఇప్పుడు లెబనాన్ రాజధానిపై దాడిచేసి ఆ పని కూడా పూర్తిచేసింది. అయితే, అరౌరీ మృతిపై ఇజ్రాయెల్ ఆర్మీ నేరుగా స్పందించలేదు.

More Telugu News