Hit And Run: ‘హిట్ అండ్ రన్’ పై డ్రైవర్ల ఆందోళనకు కారణమిదే..!

  • కొత్త చట్టాలు భారీ వాహనాల డ్రైవర్లకు శాపంగా మారతాయని ఆందోళన
  • శిక్షను గరిష్ఠంగా పదేళ్లకు పెంచడంపై అభ్యంతరం
  • లక్షల్లో జరిమానా విధిస్తే ఎలా కట్టాలని ఆవేదన
  • బాధితులను ఆసుపత్రికి తరలించే సమయంలో దాడులు జరగొచ్చని వెల్లడి
What Is The New Hit And Run Law And Why Are Trucker Drivers Opposing It

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టాలలో ‘హిట్ అండ్ రన్’ కేసులకు శిక్ష పెంపుపై డ్రైవర్లు నిరసన వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా మూడు రోజుల ఆందోళనలకు పిలుపునిచ్చారు. మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్ లలో ట్రాన్స్ పోర్ట్ అసోసియేషన్, డ్రైవర్లు సేవలు నిలిపివేశారు. దేశవ్యాప్తంగా పలుచోట్ల రోడ్లను దిగ్బంధించారు. దీంతో కమర్షియల్ వాహనాలు, ట్రక్కులు, ట్యాంకర్లు ఎక్కడివక్కడే ఆగిపోయాయి. ఫలితంగా పెట్రోల్ సరఫరా నిలిచిపోయి బంకుల్లో కొరత ఏర్పడింది. థానే చుట్టుపక్కల ప్రాంతాల్లో పలు బంక్ లు మూతపడ్డాయి. పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడడంతో వాహనదారులు పెట్రోల్ బంకుల ముందు క్యూ కట్టారు. దేశవ్యాప్తంగా పెట్రోల్ బంకుల ముందు జనం బారులు తీరారు.

ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) స్థానంలో భారతీయ న్యాయ సంహిత పేరుతో కేంద్ర ప్రభుత్వం కొత్త నేర చట్టాలను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇందులో హిట్ అండ్ రన్ కేసులకు సంబంధించి పలు మార్పులు చేసింది. శిక్షలతో పాటు జరిమానాను భారీగా పెంచింది. నిర్లక్ష్యం వల్లనో, దురదృష్టవశాత్తూ ప్రమాదం జరిగిన సందర్భాలలో బాధితుల ప్రాణాలను కాపాడడమే లక్ష్యంగా నిబంధనలను సవరించింది. ప్రమాదానికి కారణమైన వారిలో బాధ్యతను పెంపొందించడమే లక్ష్యంగా మార్పులు చేసింది.

శిక్ష..

  • హిట్ అండ్ రన్ కేసులలో శిక్షను గరిష్ఠంగా పదేళ్లకు పెంచింది. అంటే.. నిర్లక్ష్యంగా, రాష్ డ్రైవింగ్ తో బాధితుడి మరణానికి కారణమైతే నిందితులకు ఏడేళ్ల జైలు..
  • ప్రమాదానికి కారణమైన నిందితుడు పోలీసులకు, అంబులెన్స్ కు సమాచారం ఇవ్వకుండా ఘటనా స్థలం నుంచి పారిపోతే గరిష్ఠంగా పదేళ్ల జైలు, గరిష్ఠంగా రూ.7 లక్షల వరకు జరిమానా..
  • ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) లో హిట్ అండ్ రన్ కేసులకు (బాధితుడు మరణించిన సందర్భంలో) గరిష్ఠంగా రెండేళ్ల శిక్ష విధించే అవకాశం ఉంది.

డ్రైవర్ల ఆందోళనకు కారణం..
హిట్ అండ్ రన్ కేసులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త చట్టాలు భారీ వాహనాలను నడిపే వారికి శాపంగా మారుతాయని డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పొట్ట కూటికోసం వాహనాలను నడిపే తాము లక్షల్లో జరిమానాను ఎలా కట్టగలమని ప్రశ్నిస్తున్నారు. ప్రమాదం జరిగిన సందర్భాలలో బాధితులను ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేస్తే డ్రైవర్లపై దాడులు జరిగే అవకాశం ఉందని వాపోతున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో అక్కడున్న వారు డ్రైవర్ ను పట్టుకుని చితక్కొట్టిన సందర్భాలను ఉదహరిస్తున్నారు.

More Telugu News