Junior NTR: జపాన్‌ నుంచి హైదరాబాద్ చేరుకున్న జూనియర్ ఎన్టీఆర్.. తీవ్ర భూకంపంపై షాక్‌

  • గత వారమంతా ఫ్యామిలీతో జపాన్ లోనే గడిపానన్న ఎన్టీఆర్
  • భూకంప ప్రభావితమైన వారందరికీ సానుభూతి తెలిపిన యంగ్ టైగర్ 
  • జపాన్ ప్రజలు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన ఎన్టీఆర్
Junior NTR reached Hyderabad from Japan and Shocked by severe earthquake

షూటింగ్‌కు విరామం లభించడంతో క్రిస్మస్, న్యూఇయర్ వేడుకలను ఫ్యామిలీతో కలిసి జరుపుకునేందుకు జపాన్‌కు వెళ్లిన జూనియర్ ఎన్టీఆర్ తిరిగి హైదరాబాద్ చేరుకున్నాడు. తీవ్ర భూకంపం సంభవించిన కొన్ని గంటల తర్వాత ఆయన బయలుదేరి స్వదేశానికి వచ్చేశాడు. తీవ్ర భూకంపం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. ఈ మేరకు ‘ఎక్స్’ వేదికగా స్పందించాడు.

‘‘జపాన్ నుంచి ఈరోజు ఇంటికి తిరిగొచ్చాను. తీవ్ర భూప్రకంపాలు సంభవించడం షాక్‌కు గురిచేసింది. గత వారం అంతా అక్కడే గడిపాను. భూకంప ప్రభావితమైన వారందరికీ నా సానుభూతి తెలియజేస్తున్నాను. త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను. దృఢంగా ఉండు జపాన్’’ అంటూ సోమవారం అర్ధరాత్రి ఆయన ఎక్స్ వేదికగా ఆయన రాసుకొచ్చారు.

కాగా భార్య లక్ష్మీ ప్రణతి, ఇద్దరు కొడుకులు అభయ్, భార్గవ్‌లతో కలిసి జూనియర్ ఎన్టీఆర్ జపాన్‌ వెళ్లిన విషయం తెలిసిందే. ఖాళీ సమయం దొరికినప్పుడల్లా జూనియర్ ఎన్టీఆర్ కుటుంబంతో కలిసి తరచూ అక్కడికి వెళ్తుంటాడనే విషయం తెలిసిందే. 

సునామీ హెచ్చరికల ఉపసంహరణ

కాగా తీవ్ర భూకంపాల నేపథ్యంలో సోమవారం జారీ చేసిన సునామీ హెచ్చరికలను జపాన్ ఉపసంహరించుకుంది. అన్ని సునామీ హెచ్చరికలు, సూచనలు, సలహాలను ఎత్తివేసినట్టు జపాన్ వాతావరణ సంస్థ ‘ఇషిగావా’ వెల్లడించింది. ఈ మేరకు మంగళవారం ప్రకటన విడుదల చేసింది.  కొత్త సంవత్సరం తొలి రోజున 7.6 తీవ్రతతో భారీ భూకంపం జపాన్‌ను కుదిపేసింది. కొన్ని తీర ప్రాంతాల్లో 5 మీటర్ల ఎత్తులో సముద్రపు అలలు ఎగసిపడ్డాయి. దీంతో జపాన్ ప్రభుత్వం హైఅలెర్ట్ ప్రకటించింది. కొన్ని ప్రాంతాల్లో ప్రజలను ఎత్తైన ప్రాంతాలకు తరలి వెళ్లాలని, ఎత్తైన భవంతులు ఎక్కాలని సూచించిన విషయం తెలిసిందే.

సోమవారం మధ్య జపాన్‌లో సంభవించిన తీవ్ర భూకంపంలో కనీసం 13 మంది మరణించినట్లు అధికారులు మంగళవారం వెల్లడించారు. ఇళ్లు, రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయని తెలిపారు. ఒకచోట భారీ అగ్నిప్రమాదం జరిగిందని వివరించారు.

More Telugu News