vastu dosha: పది నెలల్లో 11 మంది ఎస్సైలు బదిలీ.. కారణం పోలీస్ స్టేషన్ కు వాస్తు దోషమేనట!

  • నల్గొండ జిల్లా చింతపల్లి పోలీస్ స్టేషన్ పై వదంతులు
  • క్లీన్ చిట్ తో వచ్చిన ఎస్సైలను కూడా చుట్టుముడుతున్న వివాదాలు
  • వాస్తు దోషం తప్పించేందుకు స్టేషన్ ముందు నిర్మాణం కూల్చివేత
Telangana Chintapalli Police Station Home To Controversies

ఇంటికి వాస్తు దోషం ఉందని మార్పులు చేర్పులు చేయడం సహజం.. కొత్త నిర్మాణం మొదలు పెట్టే ముందే వాస్తు దోషం లేకుండా చూసుకోవడమూ సాధారణమే. అయితే, పోలీస్ స్టేషన్ కు వాస్తు దోషం ఉందని, అందుకే ఆ స్టేషన్ కు బదిలీపై వచ్చిన ఎస్సైలు వచ్చిన వాళ్లు వచ్చినట్లే వెళ్లిపోతున్నారని ప్రచారం జరుగుతోంది. ఒకరిద్దరు కాదు.. పది నెలల కాలంలో పదకొండు మంది ఎస్సైలు బదిలీ కావడమే ఈ ప్రచారానికి ఊతమిస్తోంది.

క్లీన్ చిట్ తో వచ్చిన ఎస్సైలు కూడా వివాదాల్లో చిక్కుకుంటున్నారని, దీనికి కారణం స్టేషన్ కు ఉన్న వాస్తు దోషమేనని అంటున్నారు. ఈ ప్రచారం నేపథ్యంలో పోలీస్ ఉన్నతాధికారులు స్పందించి వాస్తు దోష నివారణ చర్యలు చేపట్టారు. వాస్తు పండితుడు చెప్పాడని స్టేషన్ ముందున్న గోడను కూల్చేశారు. నల్గొండ జిల్లా చింతపల్లి పోలీస్ స్టేషన్ లో ప్రస్తుతం వాస్తు దోష నివారణ పనులు జరుగుతున్నాయి.

హైదరాబాద్‌- నాగార్జున సాగర్‌ హైవేపై ఉన్న చింతపల్లి పోలీస్‌ స్టేషన్‌కు డిపార్ట్ మెంట్ లో క్రేజ్ ఎక్కువ.. ఇక్కడ పనిచేయాలని ఎస్సైలు పోటీపడుతుంటారు. సిఫార్సుల కోసం రాజకీయ నేతల చుట్టూ తిరుగుతుంటారు. అయితే, ఇదంతా మొన్నటి వరకే.. ఇప్పుడు ఆ స్టేషన్ కు వెళ్లాలంటే ఎస్సైలు జంకుతున్నారు. ఇటీవల పది నెలల కాలంలో అక్కడికి వెళ్లిన 11 మంది ఎస్సైలను వివాదాలు చుట్టుముట్టడమే దీనికి కారణం.

ఈ అనర్థాలకు వాస్తు దోషమే కారణమని డిపార్ట్ మెంట్ వర్గాల్లో చర్చ జరుగుతుండడంతో ఉన్నతాధికారులు స్పందించి నివారణ చర్యలు చేపట్టారు. వాస్తు దోషం లేకుండా చేసేందుకు స్టేషన్‌ ముందున్న గోడను కూల్చివేశారు. ఈ చర్యతో స్టేషన్ కు పట్టిన వాస్తు దోషం తొలిగిపోతుందా.. బదిలీపై వచ్చిన ఎస్సై కొంతకాలం పాటు ఎలాంటి వివాదాల్లో చిక్కుకోకుండా ఇక్కడే విధులు నిర్వహిస్తారా అనేది తేలాలంటే వేచి చూడాల్సిందే.

More Telugu News