Vidadala Rajini: విడదల రజని కార్యాలయంపై టీడీపీ, జనసేన కార్యకర్తల దాడి

  • గుంటూరు విద్యానగర్ లో విడదల రజని కార్యాలయం
  • అర్ధరాత్రి కార్యాలయంపై రాళ్లు రువ్విన టీడీపీ, జనసేన కార్యకర్తలు
  • కొందరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
Vidadala Rajani office attacked by TDP and Janasena workers

కొత్త సంవత్సర వేడుకల సమయంలో గుంటూరులో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి.  వివరాల్లోకి వెళ్తే... మంత్రి విడదల రజనిని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జీగా నియమించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె గుంటూరులోని విద్యానగర్ లో కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ ఉదయం కార్యాలయం ప్రారంభోత్సవం కావాల్సి ఉంది. అయితే, నిన్న అర్ధరాత్రి రజని ప్రారంభించాల్సి ఉన్న కార్యాలయంపై టీడీపీ - జనసేన కార్యకర్తలు దాడి చేశారు. 

రజని కార్యాలయానికి సమీపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి టీడీపీ, జనసేన కార్యకర్తలు రాత్రి క్షీరాభిషేకం చేశారు. అనంతరం ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ సమయంలో కొందరు ఆఫీసుపై రాళ్లు రువ్వారు. ఈ దాడిలో ఆఫీసు అద్దాలు ధ్వంసమయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని, లాఠీఛార్జ్ చేసి అందరినీ చెదరగొట్టారు. కొందరు టీడీపీ, జనసేన కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. 

ఈ ఘటనపై విడదల రజనీ స్పందిస్తూ... కావాలనే తన కార్యాలయంపై దాడికి పాల్పడినట్టు తెలుస్తోందని అన్నారు. అద్దాలను పగులగొట్టిన పెద్ద రాళ్లను చూపిస్తూ... ఇంత పెద్ద రాళ్లు ఎక్కడి నుంచి వస్తాయని ప్రశ్నించారు. ముందుగానే ప్లాన్ చేసుకుని దాడికి పాల్పడ్డారని చెప్పారు. దాడికి పాల్పడిన వారిని వదిలే ప్రసక్తే లేదని అన్నారు. మరోవైపు, రజిని కార్యాలయం వద్ద పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.

More Telugu News