Team India: ఈ ఏడాది టీమిండియా బిజీ బిజీ.. షెడ్యూల్ ఇదిగో!

  • ఎల్లుండి నుంచి సౌతాఫ్రికాతో రెండో టెస్టు
  • భారత్‌లో పర్యటించనున్న ఆఫ్ఘనిస్థాన్, ఇంగ్లండ్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా
  • శ్రీలంకలో పర్యటించనున్న టీమిండియా
  • ఏప్రిల్-మే మధ్య ఐపీఎల్
  • జూన్‌లో టీ20 ప్రపంచకప్
Team India Busy This Year With Schedules

వరుస షెడ్యూళ్లతో ఈ ఏడాది టీమిండియా బిజీబిజీగా గడపనుంది. ప్రపంచకప్ ఫైనల్‌లో దారుణ ఓటమి సగటు క్రికెట్ అభిమానికి తీవ్ర నిరాశను మిగిల్చినా ఈ ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకుని దేశానికి మరో కప్ అందించాలని రోహిత్ సేన పట్టుదలగా ఉంది. ఈ ఏడాది భారత జట్టు స్వదేశంతోపాటు విదేశాల్లోనూ పలు సిరీస్‌లు ఆడనుంది. 

ఈ నెల 3 నుంచి 7వ తేదీ వరకు దక్షిణాఫ్రికాతో కేప్‌‌టౌన్‌లో రెండో టెస్టు జరుగుతుంది. ఆ తర్వాత ఈ నెల 11 నుంచి ఆఫ్ఘనిస్థాన్‌‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం అవుతుంది. 11న మొహాలీలో తొలి మ్యాచ్ జరగనుండగా 14న ఇండోర్‌లో, 17న బెంగళూరులో రెండు, మూడు టీ20లు జరుగుతాయి. ఇదే నెలలో ఇంగ్లండ్ జట్టు భారత్‌లో పర్యటించి 5 టెస్టులు ఆడుతుంది. జనవరి 25 నుంచి 29 వరకు జరగనున్న తొలి టెస్టుకు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వనుండగా, ఫిబ్రవరి 2-6 మధ్య విశాఖపట్టణంలో రెండో టెస్టు, 15-19 మధ్య రాజ్‌కోట్‌లో మూడో టెస్టు జరుగుతుంది. 23 నుంచి 27 వరకు జరగనున్న నాలుగో టెస్టుకు రాంచీ, మార్చి 7 నుంచి 11 వరకు జరగనున్న ఐదో టెస్టుకు ధర్మశాల ఆతిథ్యమిస్తాయి.

ఏప్రిల్-మే మధ్య ఇండియన్ ప్రీమియర్ లీగ్ కారణంగా అంతర్జాతీయ మ్యాచ్‌లకు విరామం లభించనుంది. ఆ తర్వాత జూన్‌లో జరగనున్న టీ20 ప్రపంచకప్‌‌కు వెస్టిండీస్, అమెరికా ఆతిథ్యమిస్తాయి. జులైలో భారత జట్టు శ్రీలంకలో పర్యటిస్తుంది. ఈ సందర్భంగా మూడు వన్డేలు, అంతే సంఖ్యలో టీ20లు ఆడుతుంది. సెప్టెంబరులో బంగ్లాదేశ్‌ జట్టు భారత్‌లో పర్యటించి రెండు టెస్టులు, మూడు టీ20లు ఆడుతుంది. అక్టోబరులో భారత జట్టు స్వదేశంలో న్యూజిలాండ్‌తో మూడు టెస్టులు ఆడుతుంది. నవంబర్, డిసెంబర్‌లో భారత జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించి ఐదు టెస్టులు ఆడుతుంది.

More Telugu News