Big Bash League 2023-24: బిగ్‌బాష్ లీగ్‌లో స్టోయినిస్ వీరంగం.. లీగ్ చరిత్రలోనే ఘనమైన రికార్డు

  • అత్యధిక పరుగుల ఛేదన రికార్డును అందుకున్న మెల్‌బోర్న్ స్టార్స్
  • 206 పరుగుల లక్ష్యాన్ని మరో ఓవర్ మిగిలి ఉండగానే మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి సాధించిన వైనం
  • 19 బంతుల్లో 55 పరుగులు చేసిన స్టోయినిస్
  • స్టేడియంలో ఏకంగా 42,504 మంది వీక్షణ
  • మ్యాచ్ అనంతరం మైదానంలో బాణసంచా కాల్చి న్యూ ఇయర్ వేడుకలు
Marcus Stoinis helps Melbourne Stars record chasing win against Adelaide Strikers

బిగ్‌బాష్ లీగ్‌లో మెల్‌బోర్న్ స్టార్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆసీస్ ఆటగాడు మార్కస్ స్టోయినిస్ మైదానంలో విధ్వంసం సృష్టించాడు. అడిలైడ్ స్ట్రైకర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వీరంగమేసిన స్టోయినిస్ 19 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో అజేయంగా 55 పరుగులు చేసి 206 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో కీలక పాత్ర పోషించాడు. 19వ ఓవర్‌లో 24 పరుగులు బాదిన స్టోయినిస్.. ఆ ఓవర్‌లో చివరి మూడు బంతులను 4,6,6గా బాది హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. బిగ్‌బాష్ టోర్నీ చరిత్రలోనే ఇది అత్యధిక ఛేదనగా రికార్డులకెక్కింది. ఈ మ్యాచ్‌ను స్టేడియంలో ఏకంగా 42,504 మంది అభిమానులు వీక్షించడం మరో విశేషం.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన అడిలైడ్ స్ట్రైకర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. క్రిస్‌లిన్ 42 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్లతో 83 పరుగులు చేయగా, మాథ్యూ షార్ట్ 32 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 56 పరుగులు చేశాడు. 

అనంతరం 206 పరుగుల భారీ లక్ష ఛేదనతో బరిలోకి దిగిన మెల్‌బోర్న్ మరో ఓవర్ మిగిలి ఉండగానే మూడు వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుని నూతన సంవత్సరానికి విజయంతో స్వాగతం పలికింది. డానియల్ లారెన్స్ 26 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 50, బ్యూ వెబ్‌స్టర్ 48 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో అజేయంగా 66 పరుగులు చేశాడు. చివర్లో స్టోయినిస్ చెలరేగిపోవడంతో జట్టుకు అపురూప విజయం దక్కింది. మ్యాచ్ అనంతరం స్టేడియంలో రంగురంగుల బాణసంచా కాల్చి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ నిర్వహించారు.

More Telugu News