DK Shivakumar: జైహింద్ టీవీ చానల్లో డీకే శివకుమార్ పెట్టుబడులు...? నోటీసులు జారీ చేసిన సీబీఐ

  • డీకే శివకుమార్ పై ఇప్పటికే ఆదాయానికి మించిన ఆస్తుల కేసు
  • టీవీ చానల్లో పెట్టుబడుల వ్యవహారంపై కన్నేసిన సీబీఐ
  • డీకే కుటుంబీకుల పెట్టుబడుల వివరాలు సమర్పించాలంటూ చానల్ కు నోటీసులు
  • ఇది రాజకీయ ప్రతీకార చర్య అంటూ మండిపడిన చానల్ ఎండీ
CBI issues notice to Jai Hind tv channel in DK Shivakumar assets case

కర్ణాటక డిప్యూటీ సీఎం, రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ చిక్కుల్లో పడ్డారు. డీకే శివకుమార్ పై ఇప్పటికే ఆదాయానికి మించిన ఆస్తుల కేసు ఉంది. అందులో భాగంగా సీబీఐ జైహింద్ టీవీ చానల్ కు సీఆర్పీసీ-91 కింద నోటీసులు జారీ చేసింది. 

కేరళకు చెందిన జైహింద్ టీవీ చానల్లో డీకే శివకుమార్, ఆయన కుటుంబ సభ్యులు పెట్టుబడులు పెట్టినట్టు భావిస్తున్నారు. ఇప్పుడా పెట్టుబడులపై సీబీఐ ఆరా తీస్తోంది. జనవరి 11న సంబంధిత పత్రాలతో తమ ముందు హాజరుకావాలని జైహింద్ చానల్ ఎండీ బీఎస్ షిజును సీబీఐ కోరింది. డీకే, ఆయన భార్య ఉష పేరిట చానల్లో ఉన్న పెట్టుబడుల వివరాలు అందించాలని చానల్ ఎండీకి నోటీసుల్లో స్పష్టం చేసింది. 

డీకే, ఆయన కుటుంబ సభ్యుల పేరిట చానల్లో ఉన్న పెట్టుబడులపై డివిడెండ్లు, షేర్ల లావాదేవీలు, అకౌంట్ పుస్తకాలు, అగ్రిమెంట్ వివరాలు, బ్యాంకు స్టేట్ మెంట్లు, హోల్డింగ్స్ వివరాలు అన్నీ సమర్పించాలని సీబీఐ స్పష్టం చేసింది. కాగా, జైహింద్ చానల్లో డీకే కుమారుడి పేరిట కూడా పెట్టుబడులు ఉన్నట్టు సీబీఐకి సమాచారం అందినట్టు తెలుస్తోంది. 

నోటీసుల వ్యవహారంపై జైహింద్ చానల్ ఎండీ బీఎస్ షిజు స్పందించారు. సీబీఐ నోటీసులు అందాయని, వారు కోరిన విధంగా అన్ని పత్రాలు సమర్పిస్తామని తెలిపారు. తాము ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని, అన్ని పత్రాలు ఉన్నాయని స్పష్టం చేశారు. ఇది బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ రాజకీయ ప్రతీకార చర్యగానే తాము భావిస్తున్నామని అన్నారు.

More Telugu News