IndiGo: ఇండిగో, ఎయిర్ ఇండియా మధ్య తీవ్ర పోటీ.. భారత విమానయానానికి కొత్త శకం

  • ఇండిగో-ఎయిర్ ఇండియా మధ్య పోటీతో విమానయానరంగంలో పురోగతి
  • విస్తరణ ప్రణాళికలు ప్రకటించిన రెండు సంస్థలు
  • దేశీయ మార్గాల్లో బిజినెస్ క్లాస్ ప్రవేశపెట్టే యోచనలో ఇండిగో
  • ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడనున్న స్పైస్‌జెట్
  • ‘కాపా ఇండియా’ నివేదికలో పలు విషయాల వెల్లడి
Expect high competitive intensity between IndiGo and Air India from 2024

2024 కొత్త సంవత్సరంలో భారత విమానయాన రంగానికి కొత్త శకం ఆరంభం కానుంది. దేశంలో ఇండిగో, ఎయిర్ ఇండియా విమానయాన సంస్థల మధ్య పోటీ పెరగడంతో 2024లో విమానయాన రంగం కొత్త శకానికి నాంది పలుకుతుందని ఏవియేషన్ కన్సల్టెన్సీ సంస్థ కాపా ఇండియా విడుదల చేసిన నివేదికలో తెలిపింది. భారతదేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా రెండు కీలక విమానయాన సంస్థల మధ్య పోటీతో ఈ రంగం పురోగమిస్తోంది.

ఇండిగో, ఎయిర్ ఇండియా దూకుడుగా తన విస్తరణ ప్రణాళికలను ప్రకటించాయి. దేశీయ పౌర విమానయాన మార్కెట్‌లో 88.3 శాతం వాటాను ఇండిగో, టాటా గ్రూప్ ఎయిర్‌లైన్స్-ఎయిర్ ఇండియా, విస్తారా సంస్థలు నియంత్రిస్తున్నాయి. భవిష్యత్ వృద్ధిని దృష్టిలో ఉంచుకుని రెండు ఎయిర్‌లైన్ గ్రూపులు భారీ విమానాల విస్తరణ, ఆధునికీకరణ ప్రణాళికలను రూపొందించాయి. ఈ సంవత్సరం ప్రారంభంలో ఇండిగో 500 ఎయిర్‌బస్ జెట్‌లను ఆర్డర్ చేసింది. ఇది వాణిజ్య విమానయాన చరిత్రలో అతిపెద్ద ఎయిర్‌క్రాఫ్ట్ ఆర్డర్. ఎయిర్‌బస్, బోయింగ్ నుంచి 470 న్యారో బాడీ, వైడ్ బాడీ ఎయిర్‌క్రాఫ్ట్‌ల ఆర్డర్‌తో ఎయిర్ ఇండియా గ్రూప్ రెండవ స్థానంలో ఉంది. 

టాటా గ్రూప్ ప్రస్తుతం దాని నాలుగు ఎయిర్‌లైన్‌లను-ఎయిర్ ఇండియా, విస్తారా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, ఏఐఎక్స్ కనెక్ట్ లతో తన బ్రాండ్ ను నిలుపుకుంటోంది. ఇండిగో దేశీయ మార్గాల్లో బిజినెస్ క్లాస్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉందని కాపా ఇండియా తెలిపింది. ప్రస్తుతం, ఇస్తాంబుల్‌కు విమానాలను నడపడానికి టర్కిష్ ఎయిర్‌లైన్స్ నుంచి లీజుకు తీసుకున్న రెండు వైడ్-బాడీ విమానాలు మినహా ఇండిగోకు బిజినెస్ క్లాస్ ఆఫర్ లేదు. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న స్పైస్‌జెట్‌ కొత్త నిధులను పొందడం వల్ల క్యారియర్ పునరుద్ధరణకు అవకాశం ఉందని కన్సల్టెన్సీ సంస్థ పేర్కొంది.

విస్తరణ ప్రణాళికలు
ఇండిగో తన విమాన గమ్యస్థానాల సంఖ్యను 100 నుంచి 115కి విస్తరించింది. ఇండిగో బాలి, మదీనా, అయోధ్యను కొత్తగా తమ గమ్యస్థానాల జాబితాలో చేర్చాలని యోచిస్తోంది. భారతీయ విమానయానం 2024వ సంవత్సరంలో అంతర్జాతీయ విభాగంలో భారీ గేమ్‌ప్లేను చూసేందుకు సిద్ధంగా ఉంది. ఒకవైపు, దేశీయ మార్కెట్‌లో ఆధిపత్యం చెలాయిస్తున్న ఇండిగో, అంతర్జాతీయ విమానాల్లోనూ మార్కెట్ వాటాను పొందాలని లక్ష్యంగా పెట్టుకుంది. 
 
విదేశీ ఎయిర్‌లైన్స్‌తో ఇండిగో ఒప్పందాలు
ప్రస్తుతం ఇండిగో 85 దేశీయ, 32 అంతర్జాతీయ గమ్యస్థానాలకు సేవలు అందిస్తోంది, గత సంవత్సరంలో పలు కొత్త గమ్యస్థానాలు జోడించారు. ఇండిగో బ్రిటిష్ ఎయిర్‌వేస్, క్వాంటాస్, టర్కిష్ ఎయిర్‌లైన్స్‌తో సహా 8 అంతర్జాతీయ విమానయాన సంస్థలతో కోడ్‌షేర్ ఒప్పందాలను కుదుర్చుకుంది. గ్లోబల్ ఎయిర్‌లైన్ గా మారడమే లక్ష్యంగా ఇండిగో ప్రణాళిక రూపొందించిందని ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ చెప్పారు.

More Telugu News