David Warner: సొంత మైదానంలో చివరి టెస్ట్ మ్యాచ్ ఆడనున్న డేవిడ్ వార్నర్

  • ‘సిడ్నీ క్రికెట్ గ్రౌండ్’ వేదికగా జనవరి 3 నుంచి పాకిస్థాన్‌తో షురూ కానున్న మూడవ టెస్టు
  • వార్నర్‌తో కూడిన తుది జట్టుని ప్రకటించిన ఆసీస్
  • వార్నర్‌కి ఘనంగా వీడ్కోలు పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్న క్రికెట్ ఆస్ట్రేలియా
David Warner will play the last Test match at Sydney Cricket Ground

ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం డేవిడ్ వార్నర్ సొంత మైదానం ‘సిడ్నీ క్రికెట్ గ్రౌండ్’ వేదికగా కెరీర్‌లో చివరి టెస్ట్ మ్యాచ్ ఆడనున్నాడు. పాకిస్థాన్ వర్సెస్ ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌లో చివరిది, మూడవ మ్యాచ్‌‌ అతడి టెస్టు కెరీర్‌లో చివరి మ్యాచ్ కానుంది. జనవరి 3న మొదలుకానున్న ఈ మ్యాచ్‌కు ఆస్ట్రేలియా తుది జట్టుని మూడు రోజుల ముందుగానే ప్రకటించింది. పాట్ కమిన్స్ (కెప్టెన్), స్కాట్ బోలాండ్, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), కామెరాన్ గ్రీన్, జాస్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబూషేన్, నాథన్ లియోన్, మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, డేవిడ్ వార్నర్‌లతో కూడిన పటిష్ఠ టీమ్‌ను సెలక్టర్లు ప్రకటించారు. ఇప్పటికే 2-0 తేడాతో ఆసీస్ టెస్ట్ సిరీస్ గెలుచుకున్నప్పటికీ క్లీన్ స్వీప్ చేయడమే లక్ష్యంగా మార్పులు లేకుండానే కంగారూలు బరిలోకి దిగుతున్నారు.

కాగా ఆధునిక తరం క్రికెటర్లలో డేవిడ్ వార్నర్ ఒకడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. 37 ఏళ్ల వార్నర్ మొత్తం 111 టెస్టు మ్యాచ్‌లు ఆడి 44.58 సగటుతో 8,695 పరుగులు సాధించాడు. ఇందులో 26 సెంచరీలు, 36 అర్ధ సెంచరీలు ఉన్నాయి. కెరీర్‌లో అత్యుత్తమ స్కోరు 335 (నాటౌట్) పరుగుల రికార్డును పాకిస్థాన్‌పై నమోదు చేశాడు. టెస్టుల్లో ఆస్ట్రేలియా తరపున అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో ఐదవ స్థానంలో నిలిచాడు. స్టీవ్ స్మిత్, మాజీ ఆటగాళ్లు  స్టీవ్ వా, అలెన్ బోర్డర్, రికీ పాంటింగ్‌లు అతడి కంటే ముందున్నారు.

చివరి టెస్ట్ మ్యాచ్‌లో డేవిడ్ వార్నర్ శాశ్వతంగా గుర్తుండి పోయే ఇన్నింగ్స్ ఆడాలని ఆకాంక్షిస్తున్నట్టు ఆస్ట్రేలియా సెలక్టర్ జార్జ్ బెయిలీ అన్నారు. వార్నర్ చివరి టెస్ట్ మ్యాచ్‌ను అతడి హోమ్ గ్రౌండ్‌లో సెలబ్రేట్ చేసుకోవడానికి తామంతా ఎదురుచూస్తున్నామని బెయిలీ అన్నారు. కాగా పాకిస్థాన్ సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయాలని ఎదురుచూస్తున్నామని అన్నారు. వార్నర్‌కు ఘనంగా వీడ్కోలు పలికేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా ఏర్పాట్లు చేస్తోంది.

More Telugu News