Telangana: తెలంగాణలో న్యూఇయర్ వేడుకలకు సిద్ధమవుతున్న యువతకు అలర్ట్.. కీలక ఆదేశాలు జారీ

  • ఆదివారం రాత్రి 8 గంటల నుంచే రాష్ట్రవ్యాప్తంగా డ్రంకెన్ డ్రైవ్, డ్రగ్ డిటెక్షన్ టెస్టులు నిర్వహించనున్న పోలీసులు
  • మద్యం సేవించి పట్టుబడితే భారీ జరిమానా, జైలు శిక్ష విధించే అవకాశం
  • రాష్ట్రవ్యాప్తంగా అన్ని స్టేషన్లకు ఆదేశాలు జారీ చేసిన డీజీపీ కార్యాలయం
  • న్యూఇయర్ వేడుకల వేళ హైదరాబాద్‌లో ప్రత్యేక ఆంక్షలు
  • అర్ధరాత్రి 1 గంట వరకు నడవనున్న మెట్రో రైళ్లు
Alert to those who are preparing for New Year celebrations in Telangana

ఆదివారంతో 2023 సంవత్సరం చరిత్రలో కలిసిపోనుంది. మరికొన్ని గంటల్లోనే నూతన ఏడాది 2024 మొదలుకానుంది. కొత్త ఏడాదికి గ్రాండ్‌గా వెల్‌కమ్ చెప్పేందుకు యువత ఇప్పటికే సన్నద్ధమయ్యారు. వీకెండ్ ఆదివారం రావడంతో యువతలో మరింత జోష్ కనిపిస్తోంది. అయితే నిబంధనలకు విరుద్ధంగా మద్యం సేవించి రోడ్లపై హంగామా సృష్టించేవారికి అడ్డుకట్ట వేయాలని తెలంగాణ పోలీసు శాఖ నిర్ణయించింది. ఈ మేరకు కీలక ఆదేశాలు జారీ అయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ట్రాఫిక్, లా అండ్‌‌ ఆర్డర్‌‌‌‌ పోలీస్‌‌స్టేషన్స్‌‌ పరిధిలో చెక్‌‌పాయింట్స్, బ్రీత్ ఎనలైజర్‌‌‌‌ టెస్ట్‌‌లు తప్పనిసరి చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఆదివారం రాత్రి 8 గంటల నుంచే డ్రంకెన్‌‌ డ్రైవ్, డ్రగ్‌‌ డిటెక్షన్‌‌ టెస్ట్‌‌లు చేపట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు  రాష్ట్రంలోని అన్ని పోలీస్ కమిషనరేట్లు, ఎస్‌‌పీ కార్యాలయాలకు డీజీపీ ఆఫీస్ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. మద్యం సేవించి పట్టుబడినవారి వాహనాలను సీజ్ చేయాలని అధికారులు నిర్ణయించారు.

ప్రతి పోలీస్‌‌ స్టేషన్‌‌ పరిధిలో 5 చెక్‌‌పాయింట్స్‌‌ను ఏర్పాటు చేయనున్నారు. ర్యాష్ డ్రైవింగ్, పబ్లిక్ న్యూసెన్స్ చేసే వారిపై పోలీసులు కేసులు నమోదు చేయనున్నారు. ఆల్కాహాల్ కంటెంట్‌ని బట్టి చర్యలు తీసుకోనున్నారు. రూ.10 వేలు జరిమానా, 6 నెలల జైలుశిక్ష వంటి చర్యలు తీసుకోనున్నారు. ఇక న్యూ ఇయర్ ఈవెంట్లను అర్ధరాత్రి 1 గంట తర్వాత కూడా కొనసాగిస్తే కేసులు నమోదు చేయనున్నారు. 

హైదరాబాదీలూ బీ అలర్ట్..
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో న్యూఇయర్ వేడుకలపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. మూడు కమిషనరేట్లలో మొత్తం 59 ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల పరిధిలో 260 చెక్‌‌ పోస్టు‌లు ఏర్పాటు చేయనున్నారు. ఈవెంట్స్ ఎక్కువగా జరిగే బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌‌, బేగంపేట్‌‌, సైఫాబాద్‌‌, సైబరాబాద్‌‌ పరిధిలో ఒక్కో స్టేషన్ పరిధిలో 5 నుంచి 7 చెక్‌‌పోస్టులను ఏర్పాటు చేయనున్నారు. ఆదివారం రాత్రి 8 గంటల నుంచి సోమవారం ఉదయం 7 గంటల వరకు తనిఖీలు చేయనున్నారు. ఇక ఓఆర్‌‌‌‌ఆర్‌‌‌‌పై ఎయిర్‌‌పోర్ట్‌‌కు వెళ్లే వాహనదారులకు మాత్రమే అనుమతి ఇస్తారు. నగరంలోని లంగర్‌‌‌‌హౌస్‌‌, బేగంపేట్ ఫ్లై ఓవర్ మినహా అన్ని ఫ్లై ఓవర్స్‌‌, ట్యాంక్‌‌బండ్‌‌, నెక్లెస్‌‌ రోడ్ మూసివేయనున్నారు. మరోవైపు న్యూ ఇయర్ సందర్భంగా ఆదివారం అర్ధరాత్రి ఒంటి గంట వరకు నగరంలో మెట్రో సర్వీసులు అందుబాటులో ఉండనున్నాయి.

More Telugu News