Pattabhi: ఇంత మోసం చేస్తున్న జగన్ కంసమామ కాక మేనమామ అవుతాడా?: పట్టాభి

Pattabhi take a dig at CM Jagan over Vidya Deevena scheme

  • విద్యాదీవెన పథకం అమలుపై పట్టాభి విమర్శలు
  • విద్యార్థులను జగన్ మోసం చేస్తున్నాడన్న పట్టాభి
  • కాలేజీల ఒత్తిళ్లతో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని వ్యాఖ్యలు
  • చంద్రబాబు అధికారంలోకి వస్తేనే పరిస్థితి మారుతుందని స్పష్టీకరణ 

టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ సీఎం జగన్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పచ్చి అబద్ధాలు, భారీ మోసాలు... ఇదీ నాలుగేళ్ల 8 నెలల్లో జగన్ మోసపు రెడ్డి అమలు చేసిన విద్యాదీవెన పథకం అని విమర్శించారు. 

నాలుగు విడతలు బకాయి పెట్టిన విద్యాదీవెన సొమ్ము రూ.2,800 కోట్లు, ఫీజు రీయింబర్స్ మెంట్ కింద పీజీ విద్యార్థులకు ఎగ్గొట్టిన రూ.450 కోట్లు, విద్యాదీవెన కింద గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది తగ్గించిన రూ.120 కోట్లతో మొత్తం ఇప్పటివరకు జగన్ రెడ్డి విద్యార్థులకు రూ.3,400 కోట్లు బాకీ పెట్టాడు అని పట్టాభి వివరించారు. 

గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది విద్యాదీవెన చెల్లింపుల్లో 3 లక్షల మందికి కోత పెట్టాడని ఆరోపించారు. విద్యార్థులకు మేనమామనని చెప్పే జగన్ రెడ్డి, వారి పాలిట కంసమామ అనడానికి ఇదే నిదర్శనం అని పేర్కొన్నారు. జగన్ రెడ్డి మోసంతో రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు అవమానభారంతో, కళాశాల యాజమాన్యాల ఒత్తిళ్లు తట్టుకోలేక ఆత్మహత్యాయత్నాలకు పాల్పడుతున్నారని వివరించారు. 

"సాక్షి దినపత్రిక, తనకు బాకా ఊదే నీలిమీడియాలో పచ్చి అబద్ధాలతో భారీ ప్రకటనలు ఇస్తున్న జగన్ రెడ్డి ప్రజల్ని దారుణంగా వంచిస్తున్నాడు. విద్యాదీవెన పథకం చెల్లింపులకు సంబంధించి, ఏ త్రైమాసికం ఫీజు ఆ త్రైమాసికం అయిన వెంటనే క్రమం తప్పకుండా ఠంఛనుగా చెల్లిస్తున్నానని జగన్ రెడ్డి తన సాక్షి దినపత్రికకు ఇచ్చిన ప్రకటనల్లో చెప్పాడు. 

జూలై 2023 త్రైమాసికానికి (అంటే ప్రస్తుతం సాగుతున్న 2023-24 విద్యాసంవత్సరం) సంబంధించి 8,09,039 మంది విద్యార్థులకు లబ్ది చేకూరుస్తూ రూ.584 కోట్లను నేరుగా తల్లుల ఖాతాల్లోకి జమచేస్తున్నాను అని నిన్న (29వ తేదీన) సైకో జగన్ పత్రికల్లో భారీ ప్రకటనలు ఇచ్చాడు. జగన్ రెడ్డి ప్రకటనల్లో చెబుతున్న అవాస్తవాలకు, క్షేత్రస్థాయిలో జరుగుతున్న వాటికి ఎక్కడా పొంతనలేదు. జగన్ రెడ్డి మోసాలపై విద్యాశాఖ మంత్రి బొత్స తక్షణమే నోరువిప్పాలని తెలుగుదేశం పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. 

చంద్రబాబు హయాంలో కళాశాల, విశ్వవిద్యాలయాల విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నేరుగా ఫీజు రీయింబర్స్ మెంట్ కళాశాల యాజమాన్యాలకే అందేది. జగన్ రెడ్డి వచ్చాక తల్లులకు నేరుగా ఇస్తున్నానని చెప్పి, ఉత్తుత్తి బటన్లు నొక్కి వారికి డబ్బు సరిగా జమచేయకుండా విద్యార్థుల జీవితాలతో  ఆటలాడుకుంటున్నాడు. జగన్ మోసపురెడ్డి నిర్వాకంతో, కళాశాలలకు ఫీజులు చెల్లించలేక మరోపక్క కళాశాల  యాజమాన్యాల ఒత్తిడి వల్ల మనోవేదనకు లోనై విద్యార్థులు ఆత్మహత్యాయత్నాలకు పాల్పడుతున్నారు. 

2022 ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు రాలేదని శ్రీకాకుళంలో ఒక యువతి స్థానిక ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ ఎదుట కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసింది. దీనికి కారణం ఈ మోసాల ముఖ్యమంత్రి కాదా? 2021-22 విద్యాసంవత్సరం నాలుగో త్రైమాసికం విద్యాదీవెన సొమ్ము ఇప్పటికీ చెల్లించకపోవడంతో విజయవాడలోని ఒక కళాశాల రూ.60వేల ఫీజుకట్టాలని ఒక విద్యార్థికి నోటీసు లు ఇచ్చి, పరీక్షలు రాయకుండా అడ్డుకుంది. 

నెల్లూరు జిల్లా కావలిలో డిసెంబర్ 17, 2023న ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు ప్రభుత్వం నుంచి అందలేదంటూ నర్సింగ్ కళాశాల యాజమాన్యం దాదాపు 30 మంది ఫైనల్ ఇయర్ విద్యార్థుల్ని బయటకు పంపింది. ఫీజులు చెల్లించలేదని శ్రీకృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయంలో 24 మంది విద్యార్థుల్ని 2022 ఆగస్ట్ లో నాలుగో సెమిస్టర్ పరీక్షలకు అనుమతించలేదు. రాష్ట్రంలో ఇలా ఎన్ని ఘటనలు జరిగాయో లెక్కే లేదు. వీటన్నింటికీ జగన్ రెడ్డి ఏం సమాధానం చెబుతాడు? 

దగాపడిన విద్యార్థిలోకం, లక్షలాది విద్యార్థులు రాష్ట్రం నుంచి సైకో జగన్ రెడ్డిని సాగనంపాలి. చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే విద్యార్థులకు గతంలో మాదిరే సకాలంలో ఫీజు రీయింబర్స్ మెంట్ సొమ్ము ఎప్పటి కప్పుడు సక్రమంగా అందుతుంది. కళాశాల యాజమాన్యాల ఒత్తిళ్లు, వేధింపులు లేకుండా విద్యార్థులు స్వేచ్ఛగా వారి చదువులు కొనసాగించే అవకాశం, మంచి భవిష్యత్ లభిస్తుంది” అని పట్టాభిరామ్ పేర్కొన్నారు.

Pattabhi
Jagan
Vidya Deevena
TDP
YSRCP
Andhra Pradesh
  • Loading...

More Telugu News