Revanth Reddy: ఉద్యోగం అవసరంలేదు... డబ్బు, భౌతిక ప్రపంచం నుంచి బయటపడ్డాను: మాజీ డీఎస్పీ నళిని

Former DSP Nalii after meeting with CM Revanth Reddy
  • ముఖ్యమంత్రిని కలవడం సంతోషంగా ఉందన్న నళిని
  • ప్రస్తుతం తాను పూర్తి ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నట్లు వెల్లడి
  • తనకు అప్పుడే బ్యూరోక్రసీపై నమ్మకం పోయిందన్న నళిని
  • తన మనోవ్యధను గుర్తించిన రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపిన మాజీ డీఎస్పీ

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడం తనకు సంతోషంగా ఉందని.. కానీ ఇప్పుడు తనకు ఉద్యోగం అవసరం లేదని.. తాను డబ్బు, భౌతిక ప్రపంచం నుంచి ఎప్పుడో బయటపడ్డానని మాజీ డీఎస్పీ నళిని అన్నారు. శనివారం సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ... ప్రస్తుతం తాను పూర్తి ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నానని చెప్పారు. వేద కేంద్రాలకు ప్రభుత్వ సహకారం కోరినట్లు తెలిపారు. దీనికి ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారన్నారు. త్వరలో వేదం, యజ్ఞం పుస్తకాలను పూర్తి చేస్తున్నానని... ఆ తర్వాత సనాతన ధర్మ ప్రచారం చేస్తానని వెల్లడించారు. 

తాను ఉద్యోగం చేసిన సమయంలో తాను... తన సహోద్యోగులు డిపార్టుమెంట్‌లలో ఎదుర్కొన్న సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్లానని, అలాంటి ఇబ్బందులు మరొకరికి జరగకుండా చూడాలని కోరినట్లు తెలిపారు. ఆ సమయంలోనే తనకు బ్యూరోక్రసీపై నమ్మకం పోయిందని, అందుకే ఆధ్యాత్మిక బాటను ఎంచుకున్నట్లు తెలిపారు. తన విషయంలో జరిగిన అన్ని పరిణామాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్లినట్లు చెప్పారు. ఇన్నాళ్ల తన మనోవ్యధను గుర్తించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు అన్నారు. ఇప్పుడు తన మనసుకు నచ్చిన ఆధ్యాత్మిక సేవను చేస్తున్నట్లు చెప్పారు.

  • Loading...

More Telugu News