Mallu Bhatti Vikramarka: ప్రతి శాఖను అప్పుల్లో ముంచి... తెలంగాణను అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి నెట్టారు: ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి

  • ప్రజలకు తెలియజేయాలనే శ్వేతపత్రం విడుదల చేశామన్న మల్లు భట్టి
  • విద్యుత్ కొనుగోళ్ల కోసం గత ప్రభుత్వం భారీగా ఖర్చు చేసిందని ఆగ్రహం
  • హైదరాబాద్‌లో కాకుండా.. క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలిస్తున్నామని వెల్లడి
Mallu Bhatti says telangana health condition is very critical

గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి శాఖను అప్పుల్లో ముంచిందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. భద్రాచలంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... కేసీఆర్ ప్రభుత్వం ఇష్టారీతిన అప్పులు తీసుకు వచ్చి తెలంగాణను అత్యంత ప్రమాదకరమైన.. భయంకరమైన పరిస్థితుల్లోకి నెట్టిందని మండిపడ్డారు. అందుకే ప్రతి విషయం ప్రజలకు తెలియజేయాలని అసెంబ్లీ వేదికగా శ్వేతపత్రాన్ని విడుదల చేశామన్నారు. తీవ్ర ఆర్థిక ఇబ్బంది ఉన్న ప్రస్తుత తరుణంలో బాగా ఆలోచించి.. ముందుచూపుతో సాగాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యుత్ కొనుగోళ్ల కోసం భారీగా ఖర్చు చేసిందని ఆరోపించారు. ప్రస్తుతం విద్యుత్ కొనుగోలు కింద రూ.59,580 కోట్ల బకాయిలు పెండింగ్‌లో ఉన్నట్లు తెలిపారు. విద్యుత్ శాఖ పీకల్లోతు అప్పుల్లో ఉందన్నారు. అన్ని శాఖలను అప్పుల్లో ముంచేశారని ఆరోపించారు. ఒక్క రోజు వృథా చేయకుండా ప్రతి శాఖలోని పరిస్థితులపై సంబంధిత అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌లో సమీక్ష చేయడం కాకుండా... క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలిస్తున్నామన్నారు. వాస్తవ పరిస్థితులను ప్రజల దృష్టికి తీసుకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నామన్నారు. తెలంగాణను సరైన దారిలో తీసుకువెళ్లే ప్రయత్నాలు చేస్తున్నామని మల్లు భట్టి అన్నారు.

More Telugu News