K Kavitha: అన్ని వివరాలు అడుగుతున్నారు కానీ... బ్యాంక్ అకౌంట్ గురించి అడగడం లేదేం?: కవిత ప్రశ్న

  • ఇంకోసారి బ్యాంకు అకౌంట్ అడుగుతారా? కాలయాపన చేసే ప్రయత్నం జరుగుతోందా? అని కవిత ప్రశ్న
  • ఉచిత విద్యుత్‌ను జనవరిలో అమలు చేస్తారా? అని ప్రశ్నించిన కవిత
  • మగవారి పేరుపై గ్యాస్ సిలిండర్లు ఉంటే రూ.500 ఇస్తారా? అని అడిగిన బీఆర్ఎస్ నాయకురాలు
MLC Kavitha doubts on congress six guarentee application form

ఆరు గ్యారెంటీల దరఖాస్తుల విషయంలో ప్రజలలో చాలా సందేహాలు ఉన్నాయని... అన్ని వివరాలు అడుగుతున్నారు కానీ బ్యాంక్‌ అకౌంట్ వివరాలు అడగడం లేదని చాలామంది అయోమయానికి గురవుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అనుమానం వ్యక్తం చేశారు. హన్మకొండలోని బీఆర్ఎస్ కార్యాలయంలో శనివారం ఆమె మాట్లాడుతూ... మరోసారి బ్యాంక్ అకౌంట్ అడుగుతారా? లేక కాలయాపన చేసే ప్రయత్నం జరుగుతోందా? అని ప్రజల్లో చర్చ జరుగుతోందన్నారు.

200 యూనిట్ల వరకు విద్యుత్‌ను వినియోగిస్తే ఉచితమని చెప్పారని... దీనిని జనవరిలో అమలు చేస్తారా? అని ప్రశ్నించారు. వచ్చే నెలలో ప్రజలు బిల్లు కట్టాలా, వద్దా? చెప్పాలన్నారు. ప్రజల్లో ఆరు గ్యారెంటీలపై ఇంకా ఎన్నో అనుమానాలు ఉన్నాయన్నారు. చాలామంది ఇళ్లలో మగవాళ్ల పేరు మీద గ్యాస్ సిలిండర్లు ఉన్నాయని.. అలాంటి వాళ్లకు రూ.500 సిలిండర్ వర్తిస్తుందా? లేదా? చెప్పాలన్నారు. నిరుద్యోగ భృతిపై దరఖాస్తు ఫామ్‌లో లేదన్నారు. దీని గురించి ప్రజలకు స్పష్టతనివ్వాలన్నారు. 

బీఆర్ఎస్ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ... అసెంబ్లీ ఎన్నికల ఓటమి నేపథ్యంలో ధైర్యం కోల్పోవద్దని సూచించారు. రాజకీయాల్లో ఒడిదుడుకులు సహజమేనని వ్యాఖ్యానించారు. సంయమనం పాటించి.. మన సిద్ధాంతాలతో ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. ప్రజల మనసులను గెలుచుకోవడం ద్వారా మళ్లీ గెలుస్తామన్నారు. ఎవరూ కూడా ధైర్యం కోల్పోకుండా ముందుకు సాగాలన్నారు.

More Telugu News