Indian Family: అమెరికాలో భారత సంతతికి చెందిన ముగ్గురు కుటుంబ సభ్యుల అనుమానాస్పద మృతి

  • మసాచుసెట్స్ రాష్ట్రంలో ఘటన
  • గత రెండ్రోజులుగా స్పందన లేకపోవడంతో పోలీసులకు సమాచారం అందించిన బంధువు
  • విలాసవంతమైన భవనంలో విగతజీవులుగా కనిపించిన ముగ్గురు 
Three Indian people found dead in US

రాకేశ్ కమల్ (57), టీనా (54) భార్యాభర్తలు కాగా, వారి కుమార్తె అరియానా (18)... వీరు ముగ్గురూ అమెరికాలోని తమ విలాసవంతమైన భవనంలో విగతజీవులుగా కనిపించారు. 

గత రెండ్రోజులుగా వీరి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో బంధువులు పోలీసులకు సమాచారం అందించడంతో వీరి మృతి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. మసాచుసెట్స్ రాష్ట్రంలో ఈ ఘటన జరిగింది. 

కాగా, పోలీసులు రాకేశ్ కమల్ మృతదేహం వద్ద తుపాకీని గుర్తించారు. ముగ్గురూ బుల్లెట్ గాయాలతోనే మృతి చెందినట్టు భావిస్తున్నారు. ఇంట్లో ఘర్షణ జరగడంతో... భార్య, కుమార్తెను కాల్చివేసిన రాకేశ్ కమల్... అనంతరం తనను కాల్చుకుని ఉంటాడని పోలీసుల ప్రాథమికంగా అంచనా వేశారు.

రాకేశ్ కమల్, టీనా దంపతులు అమెరికాలోని భారతీయుల్లో సంపన్నులుగా గుర్తింపు పొందారు. వీరు 11 బెడ్రూంలు ఉన్న ఖరీదైన భవనంలో నివాసం ఉంటున్నారు. ఆ భవనం విలువ భారత కరెన్సీలో రూ.41 కోట్లు ఉంటుందని అంచనా. 

రాకేశ్ కమల్, టీనా దంపతులు ఏడేళ్ల కిందట 'ఎడ్యునోవా' అనే ఎడ్యుకేషన్ సంబంధింత సంస్థను ప్రారంభించినా, దాన్ని ఎక్కువకాలం కొనసాగించలేకపోయారు. 2021లో 'ఎడ్యునోవా' మూతపడింది. ఆర్థిక ఇబ్బందులే అందుకు కారణమని, గతంలో వీరు దివాలా పిటిషన్ దాఖలు చేశారని తెలుస్తోంది.

More Telugu News