Mallu Bhatti Vikramarka: విద్యుత్ కొరత తలెత్తకుండా చర్యలు తీసుకోవాలి: సింగరేణి అధికారులకు మల్లు భట్టి ఆదేశాలు

  • వేసవిలోనూ విద్యుత్ కొరత తలెత్తకుండా చూడాలన్న మంత్రి 
  • బొగ్గు ఉత్పత్తిని పెంచి థర్మల్ పవర్ కేంద్రాలకు సరఫరా చేయాలని ఆదేశాలు 
  • ఒడిశాలోని నైనీ బొగ్గు బ్లాక్‌లో ఉత్పత్తికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచన
  • నైనీ బ్లాక్ కోసం కేంద్రం, ఒడిశా ప్రభుత్వంతో చర్చించాలని సూచన
Mallu Bhatti orders on power issue in telangana

రాష్ట్రంలో విద్యుత్ కొరత తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులకు సూచించారు. శుక్రవారం సింగరేణి సంస్థ పనితీరుపై సచివాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు. సింగరేణి గనులు, విద్యుత్ ప్రాజెక్టులు, బొగ్గు ఉత్పత్తి, రవాణా, మార్కెటింగ్, సంస్థ ఆర్థిక స్థితిగతులు, వర్క్ ఫోర్స్ తదితర అంశాలపై అధికారులు.. మంత్రికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా మల్లు భట్టి మాట్లాడుతూ... వేసవి కాలంలో విద్యుత్ కొరత తలెత్తకుండా బొగ్గు ఉత్పత్తిని పెంచి థర్మల్ పవర్ కేంద్రాలకు నిరంతరం సరఫరా చేయాలని సింగరేణి అధికారులను ఆదేశించారు. ఒడిశాలోని నైనీ బొగ్గు బ్లాక్‌లో ఉత్పత్తికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.

నైనీ బొగ్గు బ్లాక్‌లో ఉత్పత్తిని ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం, ఒడిశా ప్రభుత్వంతో చర్చించాలని సూచించారు. తద్వారా విద్యుత్ సరఫరాకు ఆటంకం కలగకుండా చూడాలన్నారు. బొగ్గు గనులను వేలం వేయడాన్ని కార్మికులు వ్యతిరేకిస్తున్నారని.. కాబట్టి సంస్థకు మేలు జరిగేలా విధానపరమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. ఈ సందర్భంగా బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై చర్చ జరిగింది. అలాగే సింగరేణి విస్తరణలో భాగంగా బొగ్గు మైనింగ్‌తో పాటు ఇతర ఖనిజాల అన్వేషణ ప్రణాళికలపై మల్లు భట్టి... అధికారుల నుంచి ఆరా తీశారు.

More Telugu News