ఏపీ వైద్య ఆరోగ్యశాఖకు కేంద్రమంత్రి ప్రశంసలు

  • ఏపీ ప్రభుత్వం వైద్య ఆరోగ్య రంగంపై ప్రత్యేకంగా దృష్టి సారించిందన్న మాండవీయ
  • ఏపీకి ఆరోగ్య రంగంలో సంపూర్ణ సహకారం అందిస్తామని హామీ
  • సీఎం జగన్, మంత్రి విడదల రజనిని అభినందిస్తున్నట్టు వెల్లడి
ఏపీ వైద్య ఆరోగ్య శాఖ పనితీరు భేష్ అంటూ కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ప్రశంసల వర్షం కురిపించారు. ఏపీ సీఎం జగన్, రాష్ట్ర వైద్య ఆరోగ్య మంత్రి విడదల రజనిని ప్రత్యేకంగా అభినందిస్తున్నట్టు తెలిపారు. 

ఆరోగ్య రంగంపై ఏపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించడం స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఆరోగ్య రంగంలో ఏపీకి సంపూర్ణ సహకారం అందిస్తామని మన్సుఖ్ మాండవీయ చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరస్పర సహకారంతోనే ప్రజలకు మరింత మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు. ఆరోగ్యవంతమైన ప్రజలతో ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పడుతుందని పేర్కొన్నారు. 

మన్సుఖ్ మాండవీయ ఇవాళ విజయవాడ జీజీహెచ్ లో క్రిటికల్ కేర్ బ్లాక్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పై వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఆరోగ్య మంత్రి విడదల రజని, టీడీపీ ఎంపీ కేశినేని నాని, స్థానిక ఎమ్మెల్యే మల్లాది విష్ణు, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు.

Mansukh Mandaviya
Health Sector
CM Jagan
Vidadala Rajini
Andhra Pradesh

More Telugu News