Kadiam Srihari: కాళేశ్వరం వెళ్లి వాస్తవాలు చెప్పినందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి థ్యాంక్స్: కడియం శ్రీహరి

  • శ్వేతపత్రాలు... జ్యుడిషియల్ విచారణ పేరుతో కాంగ్రెస్ పార్టీ నాటకాలు ఆడుతోందని విమర్శలు
  • ప్రజలకు వాస్తవాలు తెలియాలంటే న్యాయ విచారణ జరగాలని డిమాండ్
  • రూ.93వేల ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి ఎలా జరిగిందని ప్రశ్న
Kadiyam Srihari welcomes government white papers

శ్వేతపత్రాలు... జ్యుడిషియల్ విచారణ పేరుతో కాంగ్రెస్ పార్టీ నాటకాలు ఆడుతోందని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి విమర్శించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఇచ్చిన హామీలు అమలు చేయకుండా... చేయాల్సిన పనులు చేయకుండా ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలకు వాస్తవాలు తెలియాలంటే న్యాయ విచారణ జరగాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు వద్దకు వెళ్లి వాస్తవాలు తెలియజేసినందుకు కాంగ్రెస్ వారికి ధన్యవాదాలు తెలిపారు.

కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.1 లక్ష కోట్ల అవినీతి జరిగిందని రాహుల్ గాంధీ ఆరోపణలు చేశారని... కానీ ఈ ప్రాజెక్టు వ్యయం రూ.93వేల కోట్లు అని అధికారులు చెప్పారని గుర్తు చేశారు. కాళేశ్వరం కోసం పెట్టిన ఖర్చును కాంగ్రెస్ ప్రభుత్వమే ఒప్పుకుందని తెలిపారు. రూ.93వేల కోట్లు ఖర్చు చేసిన ప్రాజెక్టులో రూ.1 లక్షకోట్ల అవినీతి ఎలా జరుగుతుంది? అని నిలదీశారు. కాళేశ్వరం ప్రాజెక్టు కింద ఒక్క ఎకరాకు నీరు ఇవ్వలేదని ఆరోపిస్తున్నారని... కానీ 98వేల ఎకరాలకు నీరు ఇచ్చినట్లు అధికారులే చెప్పారని తెలిపారు. ప్రభుత్వం విడుదల చేసే శ్వేతపత్రాలు, న్యాయ విచారణలను తాము స్వాగతిస్తున్నామన్నారు.

More Telugu News