Parthasarathi: ప్రజలంతా నన్ను ఆదరిస్తున్నారు.. కానీ, జగన్ పట్టించుకోవడం లేదు: వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి ఆవేదన

  • జగన్ తనను గుర్తించకపోవడం దురదృష్టకరమన్న పార్థసారథి
  • ప్రజలే తనను కాపాడతారని వ్యాఖ్య
  • తాను ప్రజా సేవకుడిగానే ఉంటానన్న వైసీపీ ఎమ్మెల్యే
Jagan is not considering me says YSRCP MLA Parthasarathi

ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో ఏపీ రాజకీయాల్లో ఊహించని మలుపులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా వైసీపీలో ఏం జరుగుతోందో ఎవరికీ అర్థం కాని పరిస్థితి నెలకొంది. మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామాతో ప్రారంభమైన అసంతృప్తులు... రోజురోజుకూ పెరుగుతున్నాయి. నియోజకవర్గాల ఇన్ఛార్జీలను మారుస్తుండటం ఆ పార్టీ నేతలను తీవ్ర అసహనానికి గురి చేస్తోంది. ఇప్పటికే కొందరు వైసీపీని వీడారు. రాబోయే రోజుల్లో చాలా మంది నేతలు వైసీపీకి గుడ్ బై చెప్పబోతున్నారనే ప్రచారం కూడా పెద్ద ఎత్తున సాగుతోంది. తాజాగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే పార్థసారథి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. 

పెనమలూరు నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజలు తనను ఆదరిస్తున్నారని... అయినా, తమ అధినేత, సీఎం జగన్ మాత్రం తనను పట్టించుకోవడం లేదని పార్థసారథి బహిరంగంగా వాపోయారు. జగన్ తనను గుర్తించకపోవడం దురదృష్టకరమని ఆయన అన్నారు. తనకు ఎన్ని అవమానాలు ఎదురైనా... ప్రజలు తనకు అండగా ఉంటారని, తనను కాపాడతారని చెప్పారు. తాను ఎమ్మెల్యేను కానని... ఎప్పటికీ ప్రజా సేవకుడిగానే ఉంటానని అన్నారు. తన జీవితాంతం ప్రజలకు రుణపడి ఉంటానని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తనకు టికెట్ రాకపోవచ్చని సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోవైపు, పార్థసారథిని మరో నియోజకవర్గానికి పంపే ఆలోచనలో జగన్ ఉన్నట్టు సమాచారం.

More Telugu News