ips: ఇల్లు కడుతున్నానంటే భన్వర్‌లాల్‌కు రూ.38 లక్షలు ఇచ్చా: ఐపీఎస్ నవీన్ కుమార్

  • ఈ కేసులో తన ప్రమేయం లేకపోయినా ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన
  • భన్వర్ లాలే తమకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వడం లేదని ఆరోపణ
  • ఈ వ్యవహారం కోర్టులో ఉండగా బలవంతపు కేసు పెట్టారన్న నవీన్ కుమార్
IPS Naveen Kumar allegations on Bhanvar Lal

రిటైర్డ్ ఐఏఎస్ భన్వర్ లాల్ కుటుంబాన్ని మోసం చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ నవీన్ కుమార్ గురువారం మరోసారి స్పందించారు. ఈ కేసులో తన ప్రమేయం లేకపోయినప్పటికీ ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భన్వర్ లాల్ తమకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. ఈ అంశంలో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. 

పదేళ్ల క్రితం తన అన్నయ్య సాంబశివరావు, ఐఏఎస్ అధికారి భన్వర్ లాల్ మధ్య రెంటల్ అగ్రిమెంట్ జరిగిందన్నారు. ప్రారంభంలో తన అన్నయ్యకు, భన్వర్ లాల్ మధ్య మంచి సంబంధాలే ఉన్నాయని తెలిపారు.

ఆ తర్వాత భన్వర్ లాల్ ఢిల్లీలో ఉన్నారని తెలిపారు. ఆ సమయంలో ఇంటిని మరమ్మతు చేయాలని అద్దెకు ఉన్న తన అన్నయ్య సాంబశివరావుకు భన్వర్ లాల్ సూచించారని... మంచి సాన్నిహిత్యం ఉండటంతో తన అన్నయ్య... భన్వర్ లాల్ ఇంటి కోసం రూ.11 లక్షలకు పైగా ఖర్చు చేశారన్నారు. ఆ తర్వాత ఆ మొత్తాన్ని అద్దెలో అడ్జస్ట్ చేసుకుందామని తన అన్నయ్య భావించారని... కానీ అది జరగలేదన్నారు.

ఆ తర్వాత తాను భన్వర్ లాల్‌ను నమ్మి రూ.38 లక్షలు ఇచ్చానని చెప్పారు. అల్వాల్‌లో ఇల్లు కడుతున్నానని చెబితే తాను ఈ మొత్తాన్ని ఇచ్చానని వెల్లడించారు. తాను డబ్బులు ఇచ్చినట్లుగా ఆధారాలు కూడా ఉన్నాయన్నారు. 

కానీ నిజానిజాలు పరిశీలించకుండానే కేసును సీసీఎస్‌కు రిఫర్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. కుట్రలో భాగంగా తనపై కేసు పెట్టారన్నారు. ఈ వ్యవహారం కోర్టులో ఉండగా బలవంతపు కేసు పెట్టారని ఆరోపించారు.

More Telugu News