Chiranjeevi: ఈ పుస్తకాన్ని రాసిన బ్రహ్మానందంకి మనస్పూర్తి గా శుభాకాంక్షలు: చిరంజీవి

  • 'నేను మీ బ్రహ్మానందం' పేరిట ఆత్మకథ రాసిన కమెడియన్ బ్రహ్మానందం 
  • శాలువా కప్పి సన్మానించిన చిరంజీవి
  • ఈ పుస్తకం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమవుతుందని వెల్లడి
Chiranjeevi appreciates Brahmanandam

టాలీవుడ్ సీనియర్ కమెడియన్ బ్రహ్మానందం తన ఆత్మకథను పుస్తకరూపంలో తీసుకువచ్చారు. నేను మీ బ్రహ్మానందం పేరిట ఆయన తన జీవిత ప్రస్థానానికి అక్షరరూపం ఇచ్చారు. ప్రస్తుతం ఈ పుస్తకం అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లలో అందుబాటులో ఉంది. 

ఈ నేపథ్యంలో, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తనకు అత్యంత సన్నిహితుడైన బ్రహ్మానందంను అభినందించారు. తన ఇంట్లో బ్రహ్మానందంకు శాలువా కప్పి సన్మానించారు. దీనిపై చిరంజీవి సోషల్ మీడియాలో స్పందించారు. 

"నాకు అత్యంత ఆప్తుడు, దశాబ్దాలుగా తెలుగు ప్రేక్షకులందరికీ మహదానంద కారకుడు అయిన మనందరి బ్రహ్మానందం తన 40 ఏళ్ల సినీ ప్రస్థానం తాను కలిసిన అనేక వ్యక్తులు, పరిచయాలు, తెలుసుకున్న విషయాలు, దృష్టి కోణాలు, తనకెదురైన ఎన్నో ఎన్నెన్నో జీవిత అనుభవాలను రంగరించి, క్రోడీకరించి ఒక ఆత్మకథగా 'నేను' అనే పుస్తకరూపంలో మనకు అందించడం ఎంతో ఆనందదాయకం. 

తానే చెప్పినట్టు... ఒకరి అనుభవం మరొకరికి పాఠ్యాంశం కావొచ్చు, మార్గదర్శకం అవ్వొచ్చు. ఈ పుస్తకం చదివే ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం అవుతుందని, వెలకట్టలేని అనుభూతిని కలిగిస్తుందని నమ్ముతున్నాను. 

ఈ పుస్తకాన్ని రాసిన బ్రహ్మానందంకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ పుస్తక ప్రచురణకర్తలైన 'అన్వీక్షకి' వారిని అభినందిస్తున్నాను" అంటూ చిరంజీవి తన ట్వీట్ లో పేర్కొన్నారు.

More Telugu News