Pegasus: భారత జర్నలిస్టుల ఫోన్లలో పెగాసస్ నిఘా సాఫ్ట్ వేర్ నిజమే... సంచలన వాస్తవాలు వెల్లడించిన ఆమ్నెస్టీ

  • భారత్ లో విపక్ష నేతలు, జర్నలిస్టుల ఫోన్లలో పెగాసస్ ఉందన్న ఆపిల్
  • పెగాసస్ అంశంపై కేంద్రంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన విపక్షాలు
  • తమ ఫోన్లను ఆమ్నెస్టీకి అప్పగించిన 'ది వైర్' పత్రిక ఎడిటర్, మరో జర్నలిస్టు
  • ఆ ఫోన్లను తమ ల్యాబ్ లో పరీక్షించిన ఆమ్నెస్టీ
Amnesty reveals they found Pegasus software in two Indian journalists

భారత్ లో విపక్ష నేతలు, పాత్రికేయుల ఫోన్లలో పెగాసస్ నిఘా సాఫ్ట్ వేర్ ఉందంటూ కొన్ని నెలల కిందట ఆపిల్ సంస్థ తమ వినియోగదారులకు అలర్ట్ మెసేజ్ పంపిన సంగతి తెలిసిందే. దాంతో విపక్షాలు పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వాన్ని తూర్పారబట్టాయి. పెగాసస్ అంశంపై ఉభయ సభలు దద్దరిల్లాయి. 

తాజాగా, ఇదే అంశంపై ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంస్థ సంచలన వాస్తవాలు వెల్లడించింది. భారత జర్నలిస్టుల ఫోన్లలో పెగాసస్ నిఘా సాఫ్ట్ వేర్ ఉందన్న విషయం నిజమేనని స్పష్టం చేసింది. ఇద్దరు భారత పాత్రికేయుల ఫోన్లలో ఈ నిఘా సాఫ్ట్ వేర్ ను గుర్తించామని ఆమ్నెస్టీ పేర్కొంది. 

ఆపిల్ సంస్థ నుంచి అలర్ట్ వచ్చిన అనంతరం 'ది వైర్' పత్రిక సంపాదకుడు సిద్ధార్థ్ వరదరాజన్, మరో జర్నలిస్టు తమ ఫోన్లలో పెగాసస్ ఉందో లేదో తెలుసుకోవడానికి తమ ఫోన్లను ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంస్థ ఆధ్వర్యంలో నడిచే సైబర్ ల్యాబ్ కు అందించారు. ఆ రెండు ఫోన్లను తమ ల్యాబ్ లో పరీక్షించామని, వాటిలో పెగాసస్ సాఫ్ట్ వేర్ ఉన్నట్టు తేలిందని తాజాగా ఆమ్నెస్టీ వివరించింది. 

గుట్టుచప్పుడు కాకుండా ఫోన్లలోని సమాచారాన్ని సేకరించే సాఫ్ట్ వేర్ గా పెగాసస్ కు పేరుంది. సాధారణ పరిస్థితుల్లో ఈ సాఫ్ట్ వేర్ తమ ఫోన్లలో ఉన్న విషయాన్ని ఎవరూ గుర్తించలేరు.

ఈ స్పై సాఫ్ట్ వేర్ ను ఇజ్రాయెల్ కు చెందిన ఎస్ఎస్ఓ గ్రూప్ అభివృద్ధి చేసింది. అయితే, ఈ సాఫ్ట్ వేర్ ను కేవలం దేశాల ప్రభుత్వాలకు మాత్రమే విక్రయిస్తారు. భారత నిఘా సంస్థ కూడా ఎస్ఎస్ఓ గ్రూప్ నుంచి 2017లో కొన్ని నిఘా ఉత్పత్తులను కొనుగోలు చేసిన విషయం వెల్లడైంది.

More Telugu News