Sajjanar: డ్రైవర్‌పై దాడిచేసిన ఆటో డ్రైవర్లపై కఠిన చర్యలు.. సజ్జనార్ హెచ్చరిక

  • కొత్తగూడెంలో ఆర్టీసీ బస్ డ్రైవర్‌పై ఆటో డ్రైవర్ల దాడి
  • ఆర్టీసీకి సిబ్బంది వెన్నెముక లాంటి వారన్న సజ్జనార్
  • ఇటువంటి ఘటనలను సహించబోమని హెచ్చరిక
TS RTC MD Sajjanar Serious Warning To Auto Drivers

మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంపై తొలి నుంచీ ఆందోళన వ్యక్తం చేస్తున్న ఆటో డ్రైవర్లు నిన్న కొత్తగూడెం ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై దాడిచేశారు. భద్రాచలంలో మహిళా కండక్టర్‌ను ప్రయాణికులు దూషించారు. ఈ ఘటనపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తీవ్రంగా స్పందించారు. ఆర్టీసీకి సిబ్బంది వెన్నెముక లాంటి వారని, వారి నిబద్ధత కారణంగా సంస్థ మనుగడ సాగిస్తోందన్న ఆయన వారిని దూషించడం, దాడులు చేయడం సరికాదని హితవు పలికారు. ఇలాంటి ఘటనలను ఆర్టీసీ ఎంతమాత్రమూ సహించబోదని వార్నింగ్ ఇచ్చారు. బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ ఘటనలపై ఫిర్యాదు అందుకున్న స్థానిక పోలీసులు విచారణ ప్రారంభించినట్టు తెలిపారు. ప్రయాణ సమయంలో ఆర్టీసీ సిబ్బందికి ప్రయాణికులు సహకరించాలని కోరారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా సహకరించాలని కోరుతూ ఎక్స్ చేశారు.

డ్రైవర్‌పై ఎందుకు దాడిచేశారంటే...
బస్ కోసం వేచి చూసీచూసీ విసిగిపోయిన కొందరు ప్రయాణికులు ఇక లాభం లేదని ఆటోలు ఎక్కారు. అదే సమయంలో అక్కడకు బస్ రావడంతో వారంతా దిగిపోయి బస్ ఎక్కారు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన ఆటో డ్రైవర్లు బస్ డ్రైవర్ నాగరాజుపై దాడిచేశారు. ప్రయాణికులు, కండక్టర్ సరస్వతి ఎంత వారించినా వినిపించుకోలేదు. ఈ ఘటనపై కొత్తగూడెం డిపో మేనేజర్ వెంకటేశ్వరరావుతో కలిసి డ్రైవర్ నాగరాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

More Telugu News