Revanth Reddy: తెలంగాణ ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ

CM Revanth Reddy open letter to TS people
  • పథకాల కోసం ప్రతి ఒక్కరి నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు వెల్లడి
  • మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు, చేయూత పథకాల కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచన
  • అర్హులైన ప్రతి ఒక్కరి నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు తెలిపిన సీఎం
  • ఈ అవకాశాన్ని అందరూ ఊపయోగించుకోవాలని సూచన
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. వివిధ పథకాల కోసం ప్రతి ఒక్కరి నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నామని... ఈ మహత్తర అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. ఈ మేరకు ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. 'ప్రజాపాలన... ముఖ్యమంత్రి సందేశం' పేరుతో ఈ బహిరంగ లేఖను విడుదల చేశారు. అందరికీ నమస్కారం అంటూ ఈ లేఖను ప్రారంభించారు.

'ప్రజాపాలనను కోరుకొని.. ప్రజా ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు మీ అందరికీ మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు. మాట ఇచ్చినట్లుగా ప్రమాణ స్వీకారం రోజునే ఆరు గ్యారెంటీల ఫైలుపై తొలి సంతకం చేసింది మన ప్రభుత్వం. కొలువుదీరిన 48 గంటల్లోనే తెలంగాణ ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, అర్హులైన వారందరికీ రాజీవ్ ఆరోగ్యశ్రీ పది లక్షల వైద్య సాయం గ్యారెంటీలను అమలు చేసి చరిత్ర సృష్టించింది. అదే సంకల్పంతో మిగిలిన గ్యారెంటీలను కూడా నెరవేర్చేందుకు ప్రజాపాలన కార్యక్రమానికి.. మన ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలియజేసేందుకు గర్విస్తున్నాను' అని పేర్కొన్నారు.

చివరి వరుసలోని పేదవారికి కూడా సంక్షేమపథకాలు అందించినప్పుడే ఈ రాష్ట్రం.. దేశం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. ప్రజాపాలన ఉద్దేశ్యం నిస్సహాయులకు సాయం చేయడమే అన్నారు. స్వయంగా ప్రభుత్వమే ఇవాళ మీ ఊరికి... మీ ఇంటికి వచ్చిందని తెలిపారు. మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు, చేయూత పథకాల కోసం అర్హులైన ప్రతి ఒక్కరి నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని అందరూ ఊపయోగించుకోవాలని సూచించారు.
Revanth Reddy
Congress
Telangana

More Telugu News