TSRTC: మహాలక్ష్మి పథకం ఎఫెక్ట్.. పురుషుల కోసం ప్రత్యేక బస్సులు?

  • ఆర్టీసీ బస్సుల్లో మహిళా ప్రయాణికుల రద్దీ
  • వెనక సీటు వరకూ వారే ఉండటంతో పురుషులకు సీట్లు దొరకని వైనం
  • పరిస్థితిని ఆర్టీసీ ఎండీ దృష్టికి తీసుకెళ్లిన కండక్టర్లు
  • పురుషులకు ప్రత్యేక బస్సుల ఏర్పాటు యోచనలో ఆర్టీసీ
TSRTC Considering running special buses for males on specific timings

మహాలక్ష్మి పేరిట తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం అమల్లోకి వచ్చాక ఆర్టీసీ బస్సుల్లో రద్దీ గణనీయంగా పెరిగిన విషయం తెలిసిందే. కొన్ని సందర్భాల్లో బస్సులోని వెనక సీట్ల వరకూ మహిళలే కనిపిస్తున్నారు. దీంతో, సీటు దొరకని పురుషులు దిగి వెళ్లిపోతున్నట్టు ఇటీవల నిర్వహించిన ఆన్‌లైన్‌ మీటింగ్‌లో కండక్టర్లు ఆర్టీసీ ఎండీ దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ.. కొన్ని రూట్లు, సమయాల్లో పురుషుల కోసం ప్రత్యేకంగా బస్సులు నడిపే అంశాన్ని పరిశీలిస్తోంది. విద్యార్థులకు సైతం ప్రత్యేక బస్సులు నిర్వహించాలా అనే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. సీనియర్ సిటిజన్లకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు.

సమయాల వారీగా రద్దీపై పూర్తి సమాచారం వచ్చాక పురుషులకు, విద్యార్థులకు ప్రత్యేక బస్సులు నడపడం లేదా, మహిళలకు మాత్రమే ప్రత్యేక బస్సులు నడపడం, ఇతర ప్రత్యామ్నాయాలపై చర్చలు జరుగుతున్నాయని ఆర్టీసీ వర్గాలు చెబుతున్నాయి. ‘‘జీరో టికెట్ అని మహిళా ప్రయాణికుల్ని చిన్నచూపు చూడం. వారి తరపున ప్రభుత్వం ఆ చార్జీ చెల్లిస్తోంది. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా పలురకాల ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టాం’’ అని ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు.

More Telugu News