Nandi awards: మళ్లీ నంది అవార్డులు ఇచ్చేందుకు కృషి చేస్తా: తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు

  • సీఎం రేవంత్ రెడ్డితో చర్చిస్తానని హామీ ఇచ్చిన తెలంగాణ టూరిజం, సాంస్కృతిక శాఖ మంత్రి 
  • తెలంగాణ ఏర్పడ్డాక నంది అవార్డులు నిలిచిపోవడం బాధాకరమని వ్యాఖ్య
  • సినీ నటి, సింగర్ సి.కృష్ణవేణి శత వసంత మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న జూపల్లి
Efforts will be made to give Nandi awards again says Minister Jupalli Krishnarao

తెలంగాణ టూరిజం, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డితో చర్చించి మళ్లీ నంది అవార్డులు అందజేసే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కళాకారులకైనా, క్రీడాకారులకైనా ప్రోత్సాహం ఎంతో అవసరమని, ఉమ్మడి రాష్ట్రంలో సినిమా పరిశ్రమకు అందించిన నంది అవార్డుల ప్రక్రియ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఆగిపోవడం బాధాకరమని వ్యాఖ్యానించారు. తిరిగి ఈ అవార్డులను అందించేందుకు తనవంతు కృషి చేస్తానని అన్నారు. సినీ నటి, గాయని, నిర్మాత సి.కృష్ణవేణి శత వసంత మహోత్సవ కార్యక్రమం సోమవారం హైదరాబాద్‌లో జరిగింది. బంజారా హిల్స్‌లోని ప్రసాద్ లాబ్స్ ప్రివ్యూ థియేటర్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి జూపల్లి హాజరయ్యారు.   

ఈ కార్యక్రమానికి హాజరైన సినీ నటుడు మురళీ మోహన్ మాట్లాడుతూ.. తిరిగి నంది అవార్డులను ప్రదానం చేసేలా చొరవ చూపాలని మంత్రి జూపల్లి కృష్ణారావుని కోరారు. గత పదేళ్లుగా ఈ నంది అవార్డుల ప్రక్రియ ఆగిపోవడం బాధాకరమని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం తరఫున ఇచ్చే నంది అవార్డులను సినీ నటీనటులు ఎంతో గౌరవంగా భావిస్తారని గుర్తుచేశారు. కాగా ఈ కార్యక్రమంలో గాయని కృష్ణవేణిని మంత్రి జూపల్లి కృష్ణారావు ఘనంగా సత్కరించారు. ఎందరో నటీనటుల భవితవ్యాన్ని కృష్ణవేణి తీర్చిదిద్దారని ప్రశంసించారు. తెలుగు సినీ రంగానికి ఆమె విశేష సేవలు అందించారని, ఆమెను సత్కరించడం చాలా ఆనందంగా ఉందని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీ నటులు జయసుధ, రోజా రమణితో పాటు పలువురు పాల్గొన్నారు.

More Telugu News