Indigo: ముంబయి నుంచి అయోధ్యకు నేరుగా విమానాలు నడపనున్న ఇండిగో

  • వచ్చే నెల 22న అయోధ్య రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ట
  • అయోధ్యకు పెరగనున్న రాకపోకలు
  • ఈ నెల 30న అయోధ్యలో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు ప్రారంభం!
Indigo set to operate direct flights between Mumbai and Ayodhya

అయోధ్యలో రామ మందిరం నిర్మాణం దాదాపు పూర్తయిన నేపథ్యంలో, ఇకపై ఈ నగరానికి రాకపోకలు పెరగనున్నాయి. అయోధ్యలో నిర్మించిన రామ మందిరంలో జనవరి 22న ప్రాణప్రతిష్ట కార్యక్రమం జరగనుంది. అనంతరం, ఆలయంలోకి భక్తులను అనుమతించనున్నారు. రామజన్మభూమిగా పేర్కొంటున్న అయోధ్యకు నిత్యం వేలాదిగా భక్తులు తరలివస్తారని భావిస్తున్నారు. 

ఇక, అయోధ్యలో నిర్మించిన మర్యాద పురుషోత్తమ్ శ్రీ రామ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు డిసెంబరు 30న ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరుపుకోనుంది. ఈ నేపథ్యంలో, ఇండిగో ఎయిర్ లైన్స్ కీలక నిర్ణయం తీసుకుంది. ముంబయి నుంచి అయోధ్యకు నేరుగా విమానాలు నడపాలని నిర్ణయించుకుంది. 

జనవరి 15 నుంచి ముంబయి-అయోధ్య మధ్య తమ సర్వీసులు నడుస్తాయని ఇండిగో ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇండిగో విమానం ప్రతి రోజూ మధ్యాహ్నం 12.30 గంటలకు ముంబయిలో బయల్దేరి, 2.45 గంటలకు అయోధ్య చేరుకుంటుందని... తిరిగి 3.15 గంటలకు అయోధ్య నుంచి బయల్దేరి, సాయంత్రం 5.40 గంటలకు ముంబయి చేరుకుంటుందని వివరించింది.

ఢిల్లీ-అయోధ్య మధ్య జనవరి 6 నుంచి, అహ్మదాబాద్-అయోధ్య మధ్య జనవరి 11 నుంచి విమాన సర్వీసులు నడుపుతామని ఇండిగో పేర్కొంది. ఈ కొత్త రూట్లు ప్రయాణాలను, పర్యాటకాన్ని, వాణిజ్యాన్ని పెంపొందిస్తాయని ఇండిగో ఎయిర్ లైన్స్ గ్లోబల్ సేల్స్ హెడ్ వినయ్ మల్హోత్రా వివరించారు.

More Telugu News