Gudivada Amarnath: ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోతే పార్టీ జెండా పట్టుకుని తిరుగుతాం: మంత్రి గుడివాడ అమర్నాథ్

  • ఇటీవల 11 నియోజకవర్గాలకు ఇన్చార్జిలను మార్చిన సీఎం జగన్
  • జగన్ ఏం చెబితే అది చేయడానికి సిద్ధంగా ఉన్నామన్న అమర్నాథ్
  • రాష్ట్ర ప్రజల భవిష్యత్తే తమకు ముఖ్యమని స్పష్టీకరణ
Gudivada Amarnath talks about party tickets

ఏపీ అధికారపక్షం వైసీపీలో కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఈసారి టికెట్ లభిస్తుందన్న గ్యారెంటీ కనిపించడం లేదు. సీఎం జగన్ ఇటీవల 11 నియోజకవర్గాలకు ఇన్చార్జిలను మార్చడం తెలిసిందే. ఈ నేపథ్యంలో, మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

"పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది. జగన్ మోహన్ రెడ్డి గారు 11 నియోజకవర్గాలకు ఇన్చార్జిలను ప్రకటించారు. ప్రకటించింది సీట్లను కాదు... బీ-ఫారం ఇచ్చినప్పుడే సీట్లు అవుతాయి. కేవలం ఇన్చార్జిలకు సంబంధించిన మార్పులు చేర్పులు చేశారు. 

నేను చాలా సందర్భాల్లో చెప్పాను... ముఖ్యమంత్రి జగన్ మా పార్టీకి జాతీయ అధ్యక్షుడు. ఆయన ఏం చెబితే అది చేయడానికి రాష్ట్రంలో ఉన్న వైసీపీ నేతలందరం సిద్ధంగా ఉన్నాం. మాకు టికెట్ ఇవ్వకపోతే ఇంకో పార్టీని చూసుకోవడం, సీటు ఇవ్వకపోతే ఇంట్లో కూర్చునే రకం కాదు మేం. సీటు ఇచ్చినా, సీటు ఇవ్వకపోయినా, మమ్మల్ని పోటీ చేయమన్నా, పోటీ చేయొద్దన్నా మేం జగన్ గారి జెండా పట్టుకుని తిరుగుతాం. 

మా పార్టీ తరఫున పోటీ చేసే 175 మంది ఎవరన్న విషయం కంటే రాష్ట్రంలోని 5 కోట్ల మంది ప్రజల భవిష్యత్తే మాకు ముఖ్యం. చాలా సమావేశాల్లో జగన్ గారు మాతో చెప్పిన మాట కూడా ఇదే. నాకు మీ అందరి కన్నా రాష్ట్రంలోని ఐదు కోట్ల మంది ప్రజలు, వారి భవిష్యత్తే ముఖ్యం... ఈ క్రమంలో నేను తీసుకునే నిర్ణయాలు మీకెవరికైనా బాధ కలిగిస్తే అందుకు నేనేం చేయలేను అని ఆయన చెబుతుంటారు" అని అమర్నాథ్ వివరించారు.

More Telugu News