Sunil Gavaskar: నా అంచనా తప్పని ఆ ఆటగాడు నిరూపిస్తాడని ఆశిస్తున్నాను: సునీల్ గవాస్కర్

  • ప్రసిద్ధ్ కృష్ణ ఇటీవలే గాయం నుంచి కోలుకోవడంతో ఎక్కువ ఓవర్లు వేయలేడన్న మాజీ దిగ్గజం
  • దక్షిణాఫ్రికాపై తొలి టెస్టులో ఒకే స్పిన్నర్‌తో ఆడితే నలుగురు పేసర్లతో ఆడాల్సి ఉంటుందని విశ్లేషణ
  • బుమ్రా, సిరాజ్‌లకు చోటు ఖాయమన్న లిటిల్ మాస్టర్
  • నలుగురు పేసర్లు అవసరమైతే ప్రసిద్ధ్ కృష్ణ, ముకేశ్ కుమార్, శార్దూల్ ఠాకూర్ మధ్య గట్టి పోటీ ఉంటుందని అంచనా
Sunil Gavaskar Doubts Prasidh Krishna Preparedness For First Test vs South Africa

సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికా వర్సెస్ భారత్ మధ్య మరికొన్ని గంటల్లో మొదటి టెస్టు మ్యాచ్ ఆరంభం కానుంది. సౌతాఫ్రికా గడ్డపై తొలిసారి టెస్ట్ సిరీస్ సాధించి చరిత్ర సృష్టించాలని టీమిండియా భావిస్తోంది. ఇందుకోసం తీవ్రంగా కసరత్తులు చేస్తోంది. అయితే భారత ఆటగాళ్ల కసరత్తులు, జట్టు కూర్పును నిశితంగా పరిశీలిస్తున్న మాజీ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. గాయం నుంచి కోలుకొని ఇటివలే జట్టులో చోటు దక్కించుకున్న పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ మొదటి మ్యాచ్‌లో రాణించే స్థాయిలో సంసిద్ధంగా ఉన్నాడని తాను భావించడంలేదని లిటిల్ మాస్టర్ అన్నాడు. గాయం నుంచి ఇటీవలే కోలుకున్న పేసర్ ఎక్కువ స్పెల్స్ వేయగలడో లేదోనని సందేహం వ్యక్తం చేశాడు. 

‘‘ ప్రసిద్ కృష్ణ గురించి నేను కచ్చితంగా చెప్పలేను. అతడు గాయం నుంచి కోలుకొని జట్టులోకి పునరాగమనం చేశాడు. రోజుకు 15-20 ఓవర్లు బౌలింగ్ చేయాల్సి వస్తే చేయగలడో లేదో కచ్చితంగా చెప్పలేం. నా అంచనా తప్పని అతడు నిరూపిస్తాడని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే ఎవరైనా నన్ను తప్పుగా నిరూపిస్తే టీమిండియా బాగా ఆడుతోందని అర్థం. భారత్ బాగా రాణిస్తే నేను చాలా సంతోషంగా ఉంటాను’’ అని సునీల్ గవాస్కర్ అన్నాడు. ఈ మేరకు ‘స్టార్ స్పోర్ట్స్’తో మాట్లాడాడు.

కాగా దక్షిణాఫ్రికాతో 2 టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా పేస్ బౌలింగ్ విషయానికి వస్తే జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ తప్పకుండా తుది జట్టులో ఉంటారని చెప్పాడు. బుమ్రా, సిరాజ్ గత ఏడాదిన్నర కాలంగా టెస్టు ఫార్మాట్‌తోపాటు పరిమితి ఓవర్ల క్రికెట్‌లోనూ రాణిస్తున్న విధానం కారణంగా వీరిద్దరూ ఆడతారని చెప్పాడు. రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలలో ఒక స్పిన్నర్‌ను మాత్రమే జట్టులోకి తీసుకుంటే భారత్ నలుగురు పేసర్లతో ఆడాల్సి ఉంటుందని విశ్లేషించాడు. అప్పుడు శార్దూల్‌ను ఆల్ రౌండర్‌గా తీసుకుంటే మరో స్థానం కోసం ముకేశ్, ప్రసిద్ధ్‌ కృష్ణల మధ్య పోటీ ఉంటుందన్నారు. పేసర్ల ఎంపిక విషయంలో ప్రసిద్ధ్ కృష్ణ, ముకేశ్ కుమార్, శార్దూల్ ఠాకూర్ మధ్య పోటీ నెలకొనే అవకాశాలున్నాయి.

More Telugu News